పరిశ్రమల ఏర్పాటుకు మంజూరు ఇవ్వండి
ఆదిలాబాద్ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటికి వెంటనే మంజూరు ఇవ్వాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్నింటికీ పరిష్కారం చూపారో తెలపాలన్నారు. ఇంకా ఏఏ కారణాలతో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. టీఎస్ ఐపాస్ కింద ఏప్రిల్ నుంచి జూలై వరకు 86 దరఖాస్తులు రాగా, 49 ఆమోదించామని, 37 దరఖాస్తులు వివిధ రకాల కారణాలతో పెండింగ్‌లో ఉన్నట్లు పరిశ్రమల శాఖ జీఎం కృష్ణరావు తెలిపారు. అభ్యంతరాలున్న వాటిని పరిష్కరించేందుకు దరఖాస్తుదారులను పిలిచి మాట్లాడాలని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం, ఆన్లైన్లో తిప్పిపంపడంతో ఆలస్యం జరుగుతుందని వివరించారు. ఫ్లైయాష్ ఇటుకల తయారీకి ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా షెడ్యూల్డ్ కులాల యువతకు అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో 74 యూనిట్లకు నాలుగు కంపెనీలకు బొగ్గు సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపినట్లు జీఎం వివరించారు. సమావేశంలో ఎల్డీఎం వినోద్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జేమ్స్ కల్వల, డీపీవో పోచయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.