అంతర పంటలు.. అధిక లాభాలు
పెరవలి: వాణిజ్య పంటల్లో అంతర పంటలుగా వివిధ రకాల కాయగూరలు, పూలసాగు అధిక లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ పంటలకు దీర్ఘకాలంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. తక్కువ కాలంలోనే పంట చేతికొస్తుంది. వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్న రైతులను అంతరపంటలు ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయి. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువగా ఉండడం వల్ల రైతులు అంతర పంటలను సాగుచేస్తున్నారు.
850 ఎకరాల్లో సాగు
పెరవలి మండలం తీపర్రు, కానూరుఅగ్రహారం,ముక్కామల, ఖండవల్లి, అన్నవరప్పాడు, మల్లేశ్వరం, కyì ంపాడు,పెరవలి, నల్లాకులవారిపాలెం, ముత్యాలవారిపాలెం, లంకమాలపల్లి గ్రామాల్లో సుమారు 850 ఎకరాల్లో రైతులు అంతర పంటలను సాగుచేస్తున్నారు. అరటి, కంద, కొబ్బరి, పసుపు, జామ వంటి పంటల్లో బెండ, మిరప, ఆకుకూరలు, వంగ వంటి పంటలతో పాటు పూలసాగు వేస్తున్నారు. వాణిజ్య పంట సాగు ప్రారంభం నుంచి ఫలసాయం అందడానికి 9 నెలల నుంచి 11 నెలల సమయం పడుతుంది. అప్పటివరకూ ఏదోవిధంగా పెట్టుబడి పెట్టాలి. ఈ ఏడాది కొబ్బరి, పసుపు, కంద పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంద, పసుపు పంటలు ఊరికలు బాగా జరిగినా గిట్టుబాటు ధర రాలేదు. ఈనేపథ్యంలో కేవలం 45 రోజుల్లో ఫలసాయం వచ్చే అంతరపంటపై రైతులు దృష్టి సారించారు. కూరగాయలు, పూల సాగు ద్వారా నిత్యం ఆదాయాన్ని ఆర్జించవచ్చని, వాణిజ్య పంటలకు పెట్టుడులకు సొమ్ము వెతుక్కోవాల్సిన పని ఉండదని రైతులు కరుటూరి విశ్వనాధం, నిడదవోలు సత్యనారాయణ తదితరులు చెబుతున్నారు.