ఎన్ఎస్ఈఎల్, జిగ్నేష్‌లపై సీబీఐ
న్యూఢిల్లీ: చెల్లింపుల సంక్షోభంలో చిక్కుకున్న నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) కార్యాలయాలతోపాటు ప్రమోటర్ జిగ్నేష్ షా, తదితర అధికారులకు సంబంధించిన 15 ప్రాంతాలలో సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఎన్‌ఎస్‌ఈఎల్‌కు ముంబైలోగల ప్రధాన కార్యాలయంతోపాటు, దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో ఈ తనిఖీలను చేపట్టింది. ప్రభుత్వ రంగ ట్రేడింగ్ సంస్థ పీఈసీ చేసిన పెట్టుబడుల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న కేసులో సీబీఐ ఈ సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ సంస్థను మోసం చేసిందన్న అభియోగాలపై ఎన్ఎస్ఈఎల్సహా, ప్రమోటర్ జిగ్నేష్ షాపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ఎన్ఎస్ఈఎల్ మాజీ సీఈవో అంజనీ సిన్హా, పీఈసీ సీజీఎం రాజీవ్ చతుర్వేది తదితర అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. మోసం, లంచగొండితనం, ఫోర్జరీల కింద కేసును నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముంబైలోని తమ కార్యాలయానికి జిగ్నేష్ షాను తీసుకెళ్లిన సీబీఐ అధికారులు పలు విధాలుగా షాను ప్రశ్నించి సమాచారాన్ని రాబట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
పీఈసీ అధికారులకూ పాత్ర
2007-13 కాలంలో వ్యవసాయ కమోడిటీలకు సంబంధించి కృత్రిమ పద్ధతిలో లావాదేవీలను నిర్వహించడం ద్వారా కొంతమంది మోసానికి పాల్పడ్డారని, తద్వారా ప్రభుత్వానికి రూ. 120 కోట్లమేర నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపించింది. దీనిలో భాగంగా పీఈసీకి చెందిన ఐదుగురు అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ముంబై ఆర్థిక నేరాల విభాగం చేపట్టిన దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించినట్లు సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా చెప్పారు. ఈ వార్తల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈఎల్‌ను ప్రమోట్ చేసిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్, అదే గ్రూప్‌నకు చెందిన ఎంసీఎక్స్ షేర్లు భారీగా నష్టపోయాయి.
బీఎస్ఈలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 4.4% పతనమై రూ. 378 వద్ద నిలవగా, ఎంసీఎక్స్ సైతం 4.6% దిగజారి రూ. 516 వద్ద ముగిసింది. వివిధ కమోడిటీ కాంట్రాక్ట్‌లకు సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 5,600 కోట్లమేర చెల్లింపులను చేపట్టలేక సంక్షోభంలో చిక్కుకున్న ఎన్ఎస్ఈఎల్ గతేడాది జూలైలో మూతపడ్డ సంగతి తెలిసిందే. కాగా, పీఈసీ లావాదేవీలకుగాను డెలివరీ చేయాల్సిన సరుకు గోదాముల్లో ఉన్నట్లు, ఇందుకు సంబంధించిన పత్రాలను జారీ చేసినట్లు ఎన్ఎస్ఈఎల్ పేర్కొన్న విషయాలు కూడా సరికాదని సీబీఐ దర్యాప్తులో తేలింది.
సెబీ మాజీ చైర్మన్ భవేపైనా...
ఎన్ఎస్ఈఎల్ చెల్లింపుల సంక్షోభం కేసును పరిశోధిస్తున్న సీబీఐ, మరోవైపు సెబీ మాజీ చైర్మన్ సీబీ భవేపైనా దృష్టి పెట్టింది. ఎన్ఎస్ఈఎల్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షాకు చెందిన ఎంసీఎక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎక్స్)కు 2008లో లెసైన్స్ మంజూరు చేసిన అంశంలో భవేపై సీబీఐ ప్రాథమిక విచారణ(పీఈ) మొదలుపెట్టింది. భవేతోపాటు, సెబీ మాజీ సభ్యుడు కేఎం అబ్రహం, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, ఎంసీఎక్స్లపైనా పీఈకి తెరలేపింది.
బోర్డు సభ్యుల రాజీనామా?
సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టిన నేపథ్యంలో సంస్థ చైర్మన్ జీకే పిళ్లైతోపాటు, బోర్డు సభ్యులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం బోర్డు అత్యవసరంగా సమావేశమవుతోందని పిళ్లైసహా వైస్‌చైర్మన్ థామస్ మాథ్యూ తదితరులు తమ పదవులకు రాజీనామా చేసే అవకాశముందని సమాచారం.