మీ ఫ్రేమ్లోపడనివ్వండి
వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు రోజూ మీ కాలనీలో...
మిమ్మల్ని ఇద్దరు ముగ్గురైనా చూస్తూనే ఉంటారు.
చూడడం అంటే ఎలా? దారిన పోయే దానయ్యలా!
వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు రోజూ మీ ఆఫీస్‌లో...
మిమ్మల్ని మీ సహోద్యోగులు చూస్తూనే ఉంటారు.
చూడడం అంటే ఎలా? దారిన పోయే దానయ్యలా!
మీరు వస్తుంటారు, పోతుంటారు. వాళ్లు చూస్తుంటారు.
చూస్తుంటారు తప్ప... ఒక్కసారీ తల తిప్పి చూడరు.
ఎందుకంటే -మీరు ఎవరికీ కొత్త కాదు. సరికొత్త అసలే కాదు.
అదే ఓల్డ్ ఫేస్, మీ కళ్లజోడుకు... అదే ఓల్డ్ ఫ్రేమ్!!
ఫేస్‌ని ఎలాగూ మార్చలేం. కనీసం ఫ్రేమ్నైనా మార్చండి.
అప్పుడు మీరిక దారిన పోయే దానయ్య కాదు.
దారిన పోనివ్వని దానయ్య అవుతారు.
అవును. సూటబుల్ ఫ్రేమ్‌తో మీరిచ్చే కొత్త లుక్...
మీ దారిలో ఎవర్నీ తిన్నగా నడవనివ్వదు.
ప్రతి చూపూ... మీ ఫ్రేమ్‌లో ప-డి-పో-వ-ల-సిం-దే!
పర్ఫెక్ట్ లుక్ కోసం...
ఫ్రేమ్ ముఖానికి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి. చెవులకు రెండువైపులా, కనుబొమల మధ్య, ముక్కుపై భాగంలో సౌకర్యవంతంగా, సరిగ్గా సరిపోయేలా ఉండాలి.
గుండ్రంటి ముఖాకృతి గలవారికి చదరపు ఆకృతి గల ఫ్రేమ్స్, చదరపు ఆకృతిగల ముఖానికి గుండ్రటి ఫ్రేమ్స్ నప్పుతాయి. కోల ముఖానికి ఏ తరహా ఫ్రేమ్ అయినా బాగా నప్పుతుంది. వీళ్ళు పెద్ద పెద్ద ఫ్రేమ్స్ ఎంచుకోవచ్చు.
స్క్యేర్ షేప్ ఫేస్ ఉన్నవారికి వంపులు తిరిగిన ఫ్రేమ్ స్టైల్స్ సూటవుతాయి.
త్రిభుజాకార ముఖాకృతి గలవారికి నుదుటిభాగాన్ని కొద్దిగా కవర్ చేసినట్టుండే మందపాటి ఫ్రేమ్స్ నప్పుతాయి.
ఫ్రేమ్స్ విశాలంగా, పెద్దగా ఉన్నవి ఎంచుకునేటప్పుడు వాటి వల్ల ముఖం వయసు పైబడినట్టు పెద్దగా లేదా చిన్నగా కనపడుతుందా అనేది చూసుకోవాలి.
ప్రతిరోజూ కొత్త లుక్‌తో కనిపించాలంటే ఒకేతరహా కళ్లజోడు కాకుండా ఫంకీ లేదా స్టైలిష్ గ్లాసెస్ మరొక జత ఉంటే ముఖ్యమైన వేడుకలలో వాడేందుకు వీలుగా ఉంటుంది. రాత్రివేళ బయటకు వెళ్లేవారు అందుకు తగిన డ్రెస్సింగ్‌తో పాటు కళ్లజోడూ ఉండేలా చూసుకోవాలి.
ఆన్లైన్లో తమ ముఖాకృతినకి తగ్గ కళ్లజోడు ఎంపికలో గెడైన్స్ తీసుకోవచ్చు. దీని వల్ల షాప్‌కి వెళ్లి పదే పదే ఎలాంటి ఫ్రేమ్ అయితే బాగుంటుంది అని చూసుకోనక్కర్లేదు. సమయం కూడా ఆదా అవుతుంది.
కళ్లజోడు ధరించినప్పుడు మెరిసే ఆభరణాలను ధరిస్తే వయసు పైబడినవారిలా కనిపిస్తారు. స్టైలిష్‌గా ఉండాలంటే ఆభరణాలను వాడకపోవడమే సముచితం.
కంటి మేకప్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గ్లాసెస్ వల్ల అప్పటికే ఆ కాంతి కంటిమీద ఉంటుంది. గోల్డ్ ఐ షాడో లేదా ఐ లాషెస్ వాడి, మస్కారా ఉపయోగిస్తే బ్రైట్‌గా కనిపిస్తారు.
కలర్స్ కీలకం
శిరోజాల రంగు, కనుబొమల తీరు, చర్మం రంగును దృష్టిలో పెట్టుకొని
కళ్లజోడును ఎంచుకోవాలి. సున్నితమైన చర్మం, మృదువైన శిరోజాలు గలవారు లేత రంగుల ఫ్రేమ్స్, ఆలివ్ లేదా చామనచాయ, నలుపు రంగు చర్మతత్వం గలవారు కాంతిమంతమైన, ముదురు రంగుల ఫ్రేమ్స్ ఎంచుకోవాలి.
ఈ సీజన్‌కి కోరల్, లైట్ ఎల్లో, వంగపండు రంగు, ఎలక్ట్రిక్ బ్లూ,
ఆరెంజ్ కలర్స్ నప్పుతాయి. అయితే రంగుకన్నా అత్యంత స్పష్టంగా చూపు కనపడటంపైనే దృష్టిపెట్టాలి.
ధర విషయంలో బేరమాడటం, స్టైల్‌గా ఉందా లేదా అని చూసుకోవడం
తర్వాత విషయాలు. మన జీవనవిధానానికి, పనులకు ఎటువంటి ఆటంకపరచని కళ్లజోడు అన్నివిధాల మేలైనది.
హెయిర్‌స్టైల్
కళ్లజోడు ధరించినప్పుడు మహిళలు హెయిర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. సైడ్ పొనీ, టాప్ పొనీ, బ్యాండ్ లేకుండా జుట్టును భుజాల మీదుగా వదిలేయడం వంటివి స్టైల్‌గా కనిపిస్తాయి.
గీకీ లుక్...
బుద్ధిమంతుల్లా, మేధావుల్లా కనిపించడానికి నేటితరాన్ని ఆకట్టుకుంటున్నది గీకీ లుక్. స్టైల్ కోసం గాగుల్స్, స్పోర్టింగ్ గ్లాసెస్ వాడే మహేష్‌బాబు, అల్లుఅర్జున్, ప్రభాస్ వంటి హీరోలూ వెండితెరమీద గీకీ లుక్‌తో క్లాస్‌నూ, మాస్‌నూ ఆకట్టుకుంటున్నారు. స్క్యేర్ షేప్, మందపాటి ఫ్రేమ్‌తో ఆకట్టుకోవడం ఈ లుక్ స్పెషాలిటీ!
యాక్ససరీస్
కళ్లజోడు ఎంపికలో నిపుణుడి సలహాతో పాటు కుటుంబసభ్యులు, స్నేహితుల సూచనలూ తీసుకోవడం శ్రేయస్కరం. ప్రముఖ డిజైనర్ల చేతుల్లో రూపుదిద్దుకున్న సరికొత్త దుస్తులను ధరించినా వాటికి తగిన యాక్ససరీస్ లేకపోతే గుర్తింపు లభించదు. ఖరీదైన ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్, చెప్పుల వాడకమే కాదు స్టైల్లో కళ్లజోడూ ప్రధానపాత్ర పోషిస్తుంది. మోడ్రన్ డ్రెస్సులు వేసుకునేటప్పుడు మందపాటి ప్రేమ్ ఉన్నవి, సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు సన్నని ఫ్రేమ్ ఉన్న కళ్లజోడును ధరించాలి.
సర్వే
ఇటీవల అమెరికాలోని విజన్ కౌన్సిల్ జరిపిన ఓ సర్వేలో 87 శాతం మంది ఏదో ఒక కళ్లజోడును ఉపయోగిస్తున్నారు. అయితే అందులో 27 శాతం మంది మాత్రమే గ్లాసెస్‌లోనూ ఫ్యాషన్‌గా ఉండేవి ఎంచుకుంటున్నారట. ఈ సర్వే నిపుణులు ఏమంటున్నారంటే- ‘చాలామందిలో చూపు సరిగ్గా కనిపించడానికే కళ్లజోడు అనే అభిప్రాయం ఉంది. దీంతో పాటు ఫ్రేమ్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే రూపంలో ఒక కొత్త స్టైల్ తెప్పించవచ్చు. జీవనశైలి ఉత్సాహంగా మారడానికి కళ్లజోడూ ఉపకరిస్తుంది’ అని అంటున్నారు.