అధికారుల పనితీరు మారాలి
వికారాబాద్: అధికారుల పనితీరు మారలని, లేదంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్‌కు మంజీరా నీళ్లు రానేలేదు.. రూ.39 లక్షల బిల్లు ఎలా వచ్చిందని మండి పడ్డారు. కాంగ్రెస్ హయాంలో మూడేళ్ల క్రితం రూ.33 కోట్లతో పైప్‌లైన్ పూర్తి చేసి చేతులు దులుపుకున్నారని, చుక్కనీరు రప్పించలేకపోయారన్నారు. ట్రయల్న్‌క్రోసం నీటిని విడుదల చేసినంత మాత్రన రూ.39 లక్షలు బిల్లు ఎలా వస్తుందని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి పైప్‌లైన్‌కే నీరు దిక్కులేదు.. రెండో పైప్‌లైన్ ఎందుకు వేస్తున్నట్లు అని ప్రశ్నించారు. మంజీరా నీటి విషయమై సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్‌లోని జలమండలి అధికారులతో మాట్లాడి చెప్పాలని ఆదేశించారు. పట్టణంలో మురుగు కాల్వలు సక్రమంగా లేవని, శాటిలైట్‌టౌన్ పేరిట ఎక్కడ పడితే అక్కడ రోడ్లన్నీ తవ్వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
జరుగుతున్న పనుల్లో నాణ్యత కొరవడిందని, డంపింగ్‌యార్డు నిర్మాణ పనుల్లో రూ.33 లక్షల నిధులు గోల్మాల్ అయినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వీటిపై విచారణ జరిపిస్తానన్నారు. తాను మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు బీటీఎస్ కాలనీలో ఉన్న ఇంద్రారెడ్డి పార్కు స్థలం ప్రభుత్వానిదని, ఈరోజు అది ప్రైవేటు వ్యక్తులది ఎలా అయిందని మున్సిపల్ అధికారులను నిలదీశారు.
ఈ స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ జైత్రాంనాయక్ను ఆదేశించారు. ఇప్పటికైనా అధికారులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, డీఈ గోపాల్, ఏఈ హన్మంత్‌రావు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మాధవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.