అనుభవాలకు అక్షర రూపం
రాయవరం : అనుభవాలను అక్షరాల్లోకి మార్చి, పుటలుగా పేర్చితే డైరీ అవుతుంది. మనసు స్పందించే ప్రతి భావాన్ని, ప్రతి సంఘటననూ, ప్రతి ఆలోచనను తనలో నిక్షిప్తం చేసుకునే అపురూప పుస్తకం డైరీ. అందుకే డైరీ మారలేదు. దాని ప్రాధాన్యం తగ్గలేదు. కొన్ని గంటల్లో 2015 గతంలోకి వెళ్లిపోతోంది. కొత్త జ్ఞాపకాలను దాచుకోవడానికి మార్కెట్లో డైరీలు సిద్ధంగా ఉన్నాయి.
సరికొత్త రూపాల్లో డైరీలు స్వాగతం పలుకుతున్నాయి. డిసెంబర్ నెలాఖరు నుంచే డైరీల కొనుగోళ్లు మొదలయ్యాయి. ప్రధాన పట్టణాల్లోని పుస్తక విక్రయశాలలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లో డైరీలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో రూ.30 నుంచి వందల రూపాయల విలువ చేసే డైరీలు లభ్యమవుతున్నాయి. వీటిని హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో షాపు యజమాని రూ.30 వేల నుంచి రూ.50 వేల విలువైన డైరీలను సిద్ధంగా ఉంచారు.
పర్సనల్ డైరీలు
ఓ వ్యక్తికి సంబంధించిన డైరీపై పూర్తి హక్కులు అతడికే ఉంటాయి. నిత్య జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాత్రివేళ నిద్రపోయే ముందు అందులో నిక్షిప్తం చేసుకుంటారు. ముఖ్య విషయాలు, తీపి జ్ఞాపకాలను అందులో పొందుపర్చుకోవచ్చు.
ప్రొఫెషనల్ డైరీలు
వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉండేవారు, క్రమంతప్పకుండా ఉపయోగించేవి ప్రొ ఫెషనల్ డైరీలు. పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ డైరీ ఓ పర్సనల్ అసిస్టెంట్‌గా సహకరిస్తుంది. దైనందిన వ్యవహారాలను మర్చిపోకుండా, సమయానుకూలంగా చేయాల్సిన పనిని గుర్తుచేస్తోంది. ప్రముఖ దినాలు, ప్రయాణాలు పొందుపర్చుకోవచ్చు.