సినీతారల డైరీ సీక్రెట్స్
పొద్దుటి నుంచి పొద్దెక్కే దాకా సమయం ఎలా గడిచిపోతుందో తెలియడం లేదు. ఒక్కసారి రోజులో మనం చేసిన విషయాలన్నీ తీరిగ్గా కూర్చొని గుర్తు చేసుకుంటూ సరిగ్గా సమీక్షించుకుంటే.. మరుసటి రోజు నుంచి మనలో వచ్చే మార్పు మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. తప్పనిసరిగా మన తప్పుల్ని తగ్గిస్తుంది. దీనికి మనం పెద్దగా ఏం చేయాల్సిందేమీ లేదు. డైరీ రాస్తే చాలంటున్నారు నిపుణులు. అందుకేనేమో కొత్త ఏడాది ప్రారంభమవుతుందంటే చాలా మంది ఆలోచించే కొత్త విషయాల్లో డైరీ రాయడం కూడా ఒకటి అనేది నిస్సందేహం. ఈ నేపథ్యంలో డైరీ రైటింగ్ గురించి సినిమా సెలబ్రిటీలు ‘సాక్షి’తో పంచుకున్న స్వీయానుభవాలివి.
- శిరీష చల్లపల్లి...
రాసేస్తే రిలీఫ్
చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటుంది. ఇప్పటికీ రోజూ డైరీ రాసేందుకు ఇష్టపడతాను. అయితే పాత డైరీలు దాచుకోను. ఏడాది గడిచాక డైరీ ఒక్కసారి చదువుకొని పడేస్తాను. ఎందుకంటే అవి నాకు కొత్తగా, ఫన్నీగా అనిపిస్తాయి. స్కూల్ ఏజ్‌లో నేను డైరీ రాయడంలో అంత ఆనెస్ట్‌గా ఉండేదాన్ని కాదు. కానీ ఏళ్లు గడిచే కొద్దీ డైరీతో నిజాయతీగా ఉండటం అలవాటు చేసుకున్నాను. మూడ్ బాగోలేనప్పుడు నాకు డైరీ చాలా రిలీఫ్ ఇస్తుందని రియలైజ్ అయ్యాను. అందుకే ఇప్పటికీ అప్పుడప్పుడు డైరీ రాస్తుంటాను. మనం ఇతరులతో షేర్ చేసుకున్న విషయాలైనా కొంత వరకు మరచిపోతాం... కానీ, డైరీలో రాసుకున్న ప్రతి విషయం మనకు గుర్తుంటుంది. అవి గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది. అందుకే ఐ లవ్ రైటింగ్ డైరీ.
- అర్చన( వేద)
డిజైన్ చేసేదాన్ని...
ఆరో తరగతి నుంచి పర్సనల్ డైరీ రాయడమంటే నాకొక క్రేజ్ లాంటిది. ఆ ఏజ్‌లో పెద్దగా దాచిపెట్టుకోవాల్సిన సీక్రెట్స్ ఏవీ లేకపోయినా అదో ఫ్యాషన్‌గా ఫీల్ అయ్యేదాన్ని. క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఫొటోలు కట్ చేసి అతికించి వాళ్ల గురించి నాకున్న ఫీలింగ్స్ వాటి కింద రాసి గ్లిట్టేర్ పెన్స్, ఫర్ఫ్యూమ్ పెన్స్‌తో డిజైన్లతో పేజీని అందంగా డెకరేట్ చేసి చూసుకొని మురిసి పోయేదాన్ని. ఆ డైరీలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి. ఎప్పుడైనా సరదాగా వాటిని తీసి చూసుకొని మురిసి పోతుంటాను. స్కూల్ గర్ల్ ఏజ్ నుంచి డ్రీమ్ గర్ల్ ఏజ్‌కు రాగానే ఫ్రెండ్స్‌తో, అమ్మతో కూడా షేర్ చేసుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అప్పుడు కొన్ని రోజులు రిస్క్ ఎందుకులే అనిపించి రాయడం మానుకున్నాను.
- సంజన
కంటిన్యూగా రాయలేను..
చిన్నప్పుడంటే స్కూల్ డైరీ రాసేవాడిని. ఆ తర్వాత సీరియస్‌గా అయితే డైరీ రాసే అలవాటు లేదు. ఎక్కువగా ఫీలింగ్స్, డైలీ షెడ్యూల్స్ రాసుకోవడానికే కదా డైరీ. కానీ చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ రాత్రి కనీసం గంట సేపయినా ఫ్యామిలీతో కూర్చొని అన్ని విషయాలు డిస్కస్ చేసి ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అయిపోవడం అలవాటు. అందుకేనేమో ఇప్పటివరకు డైరీ రాసే అవసరం రాలేదు. కానీ ఎవరైనా డైరీ ఇంపార్టెన్స్ గురించి బాగా చెబితే అప్పటికప్పుడు ఇన్స్పైర్ అయిపోయి.. వెంటనే కొత్త డైరీ తెచ్చుకొని అర్జంటుగా అన్నీ గుర్తు తెచ్చేసుకొని మరీ డైరీలో నింపేస్తుంటా. అయితే అది రెండు మూడు రోజులు మాత్రమే.
ఆ తర్వాత అది పెట్టిన చోటే ఉండి పోతుంది. మళ్లీ ఎప్పడో అది తవ్వకాల్లో బయట పడినప్పుడు చదువుకొని మురిసిపోతాను. మంచో, చెడో.. ఎవరిదైనా పర్సనల్ డైరీ పొరపాటున నాచేతిలో పడితే చదివేస్తాను. ఫోన్ మెసేజ్‌లు కూడా అంతే. టకటకా చదివేస్తాను. అలా తెలిసినా కానీ ఎవరినీ టీజ్ చేయను. ఫన్ లవింగ్ గాయ్‌ని అయినా ఇట్లాంటి విషయాల్లో ఫీలింగ్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో.. అందులోని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కామ్‌గా చదివి, వాళ్లను ఆ విషయాలను ఎప్పుడూ అడగకుండా, నాకు ఆ విషయం తెలుసని వాళ్లకు తెలియకుండా.. వారు ఎప్పుడైనా ఆ విషయాలు షేర్ చేస్తారా అని ఎదురు చూస్తానంతే.
- నందు