బిన్ లాడెన్ వందల కోట్ల వీలునామా
వాషింగ్టన్: సూడాన్ బ్యాంకుల్లో తన పేరిట ఉన్న 197.20 కోట్ల రూపాయలను, తన ఇంజనీరు సోదరుడు ఇంజనీరింగ్ కంపెనీ నుంచి తన వాటా కింద అందిన దాదాపు 82 కోట్ల రూపాయలు, మొత్తం 279 కోట్ల రూపాయల్లో సగ భాగాన్ని ప్రపంచ జిహాది కోసమే ఖర్చు పెట్టాలని ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన అల్ కాయిదా మాజీ చీప్ ఒసామా బిన్ లాడెన్ వీలునామా రాశారు. సూడాన్ బ్యాంకుల్లో మొత్తంలో సగ భాగాన్ని తన తల్లి ఖదీజా ఉమ్‌కు, తన కుమారుడు సాద్ బిన్ ఉసామాకు చెరి సమానం పంచాలని అందులో సూచించారు. అలాగే తన కూతురితోపాటు తన ముగ్గురు చెల్లెళ్లు, తన పిన తల్లులు, వారి పిల్లలకు, తన మామ, వారి పిల్లలకు ఎవరికెంత వాటా ఇవ్వాలో కూడా ఆ వీలునామాలో పేర్కొన్నారు.
సూడాన్ బ్యాంకుల నుంచి డబ్బును డ్రా చేయడంలో సహకరించిన అల్ కాయిదా మిలిటెంట్ మెహ్ఫౌజ్ అల్ వాలిద్‌కు మొత్తం సొమ్ములో ఒక శాతం ఇవ్వాలని, అందులో ఇప్పటికే అతనికి దాదాపు ఏడు కోట్ల రూపాయలు బహుమానంగా ఇచ్చానని చెప్పారు. మిగతా రావాల్సిన సొమ్మును లెక్కగట్టి ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు. తాను ఇంజనీరింగ్ కంపెనీ పెట్టడానికి తోడ్పడిన ఇంజనీరుకు ఒక వాటా ఇవ్వాలని సూచించారు. కోట్లాది రూపాయల బంగారాన్ని కూడా భార్య, పిల్లలు, చెల్లెళ్లు, చిన్నమ్మలు, మామ, వారి పిల్లలకు వాటాలు వేశారు. ఈ వీలునామాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారని ఆశిస్తున్నానని తండ్రి, కుటుంబ సభ్యులనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తాను సూచించినట్లు వాటాల పంపకం జరగకపోతే తన ఆత్మ సమాధిలోనే బంధీ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బిన్ లాడేన్ 1996కు ముందు ఐదేళ్లపాటు సూడాన్‌లో ఉన్నారు. అక్కడి ప్రభుత్వం దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించడంతో అఫ్ఘాన్‌కు వెళ్లాడు.
పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో 2011, మే 2వ తేదీన అమెరికా ప్రత్యేక సైనిక దళం బిన్ లాడెన్‌ను హతమార్చినప్పుడు ఆయన రాసిన ఈ వీలునామాతోపాటు మొత్తం 113 డాక్యుమెంట్లను అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. వీటిని అమెరికా ప్రభుత్వం ఇంతకాలం గోప్యంగా ఉంచింది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లను డీ-క్లాసిఫై చేయడంతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా వీటిని అమెరికా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయలేదు. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వాటిలో తన తండ్రికి, మిత్రులకు, మిలిటెంట్ కమాండర్లకు రాసిన పలు లేఖలు ఉన్నాయి. తనను, తనతోటి పిల్లలను పెంచి, పెద్దచేసినందుకు, తనలో జిహాది విప్లవాన్ని రగిలించినందుకు సర్వదా కృతజ్ఞుడి గా ఉంటానని కూడా ఓ లేఖలో బిన్ లాడెన్ పేర్కొన్నారు. ఒకవేళ తండ్రికన్నా తాను ముందుగానే చనిపోతే, తన భార్యా పిల్లల బాధ్యతను కూడా తండ్రే చూసుకోవాలని కోరారు. తండ్రి చూపిన బాటలో నడవనందుకు తనను క్షమించాల్సిందిగా కోరారు.
2001, సెప్టెంబర్ 11వ తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడుల పదవ వార్శికం సందర్భంగా 2011, సెప్టెంబర్ 11 వ తేదీన న్యూయార్క్, వాషింఘ్టన్లలో భీకరమైన టైస్టు దాడులు జరిపేందుకు బిన్ లాడెన్ కుట్ర పన్నినట్లు ఆ డాక్యుమెంట్లలో బయటపడింది. బిన్ లాడెన్ తాను చనిపోయే వరకు కూడా అమెరికా, దాని మిత్రపక్షాల నిఘా నేత్రం తనపైన కొనసాగుతుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నిఘా నుంచి ఎలా తప్పించుకోవాలో తనను కలవడానికి వచ్చిన జీహాదీలకు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండేవాడు. ఆకాశంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నప్పుడు మాత్రమే తనను కలసుకోవాల్సిందిగా సూచించేవాడు. చివరకు ఇరాన్లో పంటి వైద్యం చేయించుకున్న తన భార్య పంటిలో కూడా నిఘా చిప్‌ను ఏర్పాటు చేసి ఉంటారని అనుమానించాడు.