ప్రయాణికులే లక్ష్యంగా పేలుడు : 15 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని కైబర్ పక్తున్వ ప్రావిన్స్‌లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. పెషావర్ సునేరి మసీదు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మేరకు మీడియా బుధవారం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత మంది పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. పేలుడు జరిగిన ప్రాంతమంతా రక్తసిక్తంగా మారిందని తెలిపింది. మర్దన్ నగరం నుంచి పెషావర్ వెళ్తున్న ఈ బస్సులోని ప్రయాణికులే లక్ష్యంగా ఈ పేలుడు సంభవించిందని మీడియా వెల్లడించింది. ఈ పేలుడుకి తామే బాధ్యులమంటూ ఇంత వరకు ఎవరూ సంస్థ ప్రకటించలేదని చెప్పింది. మృతులంతా సచివాలయంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను మీడియా వివరించింది.