ఉన్మాదం
ప్రేమించమంటూ యువతికి వేధింపులు
శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని
కెలమంగలం : తనను ప్రేమించాలంటూ ఓ యువతిని వేధించడమే కాక తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని యువతిని కౌగిలించుకునేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... ఇంజినీరింగ్ చదివిన ధర్మపురి జిల్లా పాలక్కొడుకు చెందిన ఓ యువతి(24)కి ఎనిమిది నెలల క్రితం జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం దొరికింది. ఇంజినీరింగ్ చదువుతున్నప్పుడు ఆమెను ప్రేమించాలని నాడసంబట్టి గ్రామానికి చెందిన రామలింగం కొడుకు సంతోష్(24) వెంటపడేవాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఆ యువతి తెలిపింది. అయితే వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ఆమె అతని ప్రేమను తిరస్కరించింది. బుధవారం ఉదయం తన గ్రామం నుంచి బస్సులో బయలుదేరిన యువతిని సంతోష్ వెంబడించాడు. కెలమంగలం బస్టాండులో బస్సు దిగగానే ఆమె వాగ్వాదానికి దిగాడు.
తనను ప్రేమించాలని పట్టుపట్టాడు. ఆ సమయంలో అతని చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులతోనూ అతను వాదనకు దిగాడు. అనంతరం తన కార్యాలయానికి వెళుతున్న యువతిని వెంబడిస్తూ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేశాడు. యువతిని అడ్డగించి తను ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్‌ను తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం తనను చుట్టుముట్టిన మంటలతో యువతిని కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు.
అప్రమత్తమైన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. అప్పటికే ఇద్దరికి కాలిన గాయాలయ్యాయి. చికిత్స కోసం ప్రభుతాస్పత్రికి బాధితులను తరలించారు. మెరుగైన వైద్యం కోసం సంతోష్‌ను హొసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కెలమంగలం ఇన్స్పెక్టర్ జయశంకర్ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.