petrol price deregulation
-
పెట్రో మంట నుంచి కాస్త ఊరట
న్యూఢిల్లీ: రోజుకో రికార్డు చెరిపేస్తూ దూసుకెళ్తున్న ఇంధన ధరల నుంచి సామాన్యునికి కొంత ఊరట లభించింది. పెట్రోల్, డీజిల్ లీటరు ధరను కేంద్రం రూ.2.50 తగ్గించింది. ఇందులో రూ. 1.50 మేర ఎక్సైజ్ సుంకం రూపంలో కోత విధించగా, మరో రూపాయి తగ్గింపును చమురు కంపెనీలు సర్దుబాటుచేసుకోనున్నాయి. కేంద్రం నిర్ణయం వెలువడిన వెంటనే బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అస్సాం, త్రిపురలు రూ.2.50 మేర వ్యాట్ తగ్గించుకోవడంతో ఆ రాష్ట్రాల్లో మొత్తం తగ్గింపు రూ.5కు చేరింది. సవరించిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా నిర్ణయంతో కేంద్రం మిగిలిన ఆర్థిక సంవత్సరంలో రూ.10,500 కోట్లు, పూర్తి సంవత్సరంలో రూ.21,000 కోట్ల ఆదాయం కోల్పోనుంది. చమురు కంపెనీలు లీటరుకు రూ.1 చొప్పున భారం భరిస్తే సుమారు రూ.10,700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సగం, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లు మిగతా సగాన్ని సమానంగా భరించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కంటితుడుపు చర్యేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విమర్శించింది. డీరెగ్యులేషన్‌పై ప్రభావం లేదు: జైట్లీ రాష్ట్రాలు కూడా స్థానిక పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విజ్ఞప్తి చేశారు. ఇంధన భారాన్ని పంచుకోవాలని చమురు కంపెనీలను కోరడం మళ్లీ ప్రభుత్వ నియంత్రణకు దారితీస్తుందన్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. కంపెనీలకు ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
డీజిల్, పెట్రోలు ధరలు ఇంకా తగ్గే ఛాన్స్!
న్యూఢిల్లీ: మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధర సోమ, మంగళవారాల్లో ఒక్కసారిగా పతనమయ్యింది. అమెరికాకు ఎగుమతి చేసే క్రూడ్ ధరను సౌదీ అరేబియా తగ్గించడంతో రేట్లు భారీగా పడిపోయాయి. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(నెమైక్స్)లో ట్రేడయ్యే లైట్ స్వీట్ క్రూడ్ బ్యారెల్ ధర మంగళవారం 2.5 డాలర్లమేర దిగజారి 76 డాలర్లకు క్షీణించింది. 2011 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి పడటం ఇదే తొలిసారి. ఇక బ్రెంట్ క్రూడ్ రేటు కూడా నాలుగున్నరేళ్లకుపైగా కనిష్టానికి దిగొచ్చింది. 2 డాలర్లకుపైగా క్షీణించి 82 డాలర్ల స్థాయికి చేరింది. ఈ రెండు రకాల క్రూడ్స్ ధరలూ రెండురోజుల్లో 4 శాతానికిపైగా తగ్గాయి. దేశీయంగానూ రేట్లు డౌన్... అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే భారత్ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ముడిచమురు ధరలు మరింత శాంతిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో మంగళవారం బ్యారెల్ క్రూడ్ ధర 5 శాతంపైగా పతనమైంది. చురుగ్గా ట్రేడవుతున్న నవంబర్ నెలకు డెలివరీ అయ్యే కాంట్రాక్టు రేటు రూ.251(5.06 శాతం) క్షీణించి రూ.4,712 వద్ద ట్రేడవుతోంది. కాగా, అక్టోబర్ 31 తేదీన ఇండియన్ క్రూడ్ బాస్కెట్ బ్యారెల్ ధర 83.80 డాలర్ల వద్దకు దిగొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు కూడా దిగొచ్చాయి. ఇటీవలే లీటరు పెట్రోలుపై రూ.2.41, డీజిల్‌పై రూ.2.25 చొప్పున దేశీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లు ధరల కోతను ప్రకటించాయి. సామాన్యుడికి మరింత ఉపశమనం? తాజాగా అంతర్జాతీయ ధరలు మరింత పతనం అవుతుండటంతో సామాన్య భారతీయుడికి పెట్రో ధరల నుంచి మరింత ఉపశమనం లభించనుందా? అంతర్జాతీయ క్రూడ్ రేట్ల ఇదే ధోరణి కొనసాగినా.. ధరలు ఇప్పుడున్న స్థాయిలోనే కొంతకాలం స్థిరంగా ఉన్నా.. దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. 15 రోజులకొకసారి చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షిస్తున్నాయి. తదుపరి సమీక్ష ఈ నెల 15న ఉండనుంది. కాగా, భారత్‌కు చమురు దిగుమతుల బిల్లు కూడా భారీగా తగ్గనుండటంతో ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.