డీజిల్, పెట్రోలు ధరలు ఇంకా తగ్గే ఛాన్స్!
న్యూఢిల్లీ: మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు(క్రూడ్) ధర సోమ, మంగళవారాల్లో ఒక్కసారిగా పతనమయ్యింది. అమెరికాకు ఎగుమతి చేసే క్రూడ్ ధరను సౌదీ అరేబియా తగ్గించడంతో రేట్లు భారీగా పడిపోయాయి.
న్యూయార్క్ కమోడిటీ ఎక్స్ఛేంజ్(నెమైక్స్)లో ట్రేడయ్యే లైట్ స్వీట్ క్రూడ్ బ్యారెల్ ధర మంగళవారం 2.5 డాలర్లమేర దిగజారి 76 డాలర్లకు క్షీణించింది. 2011 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి పడటం ఇదే తొలిసారి. ఇక బ్రెంట్ క్రూడ్ రేటు కూడా నాలుగున్నరేళ్లకుపైగా కనిష్టానికి దిగొచ్చింది. 2 డాలర్లకుపైగా క్షీణించి 82 డాలర్ల స్థాయికి చేరింది. ఈ రెండు రకాల క్రూడ్స్ ధరలూ రెండురోజుల్లో 4 శాతానికిపైగా తగ్గాయి.
దేశీయంగానూ రేట్లు డౌన్...
అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగానే భారత్ ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ముడిచమురు ధరలు మరింత శాంతిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో మంగళవారం బ్యారెల్ క్రూడ్ ధర 5 శాతంపైగా పతనమైంది. చురుగ్గా ట్రేడవుతున్న నవంబర్ నెలకు డెలివరీ అయ్యే కాంట్రాక్టు రేటు రూ.251(5.06 శాతం) క్షీణించి రూ.4,712 వద్ద ట్రేడవుతోంది.
కాగా, అక్టోబర్ 31 తేదీన ఇండియన్ క్రూడ్ బాస్కెట్ బ్యారెల్ ధర 83.80 డాలర్ల వద్దకు దిగొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు కూడా దిగొచ్చాయి. ఇటీవలే లీటరు పెట్రోలుపై రూ.2.41, డీజిల్‌పై రూ.2.25 చొప్పున దేశీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లు ధరల కోతను ప్రకటించాయి.
సామాన్యుడికి మరింత ఉపశమనం?
తాజాగా అంతర్జాతీయ ధరలు మరింత పతనం అవుతుండటంతో సామాన్య భారతీయుడికి పెట్రో ధరల నుంచి మరింత ఉపశమనం లభించనుందా? అంతర్జాతీయ క్రూడ్ రేట్ల ఇదే ధోరణి కొనసాగినా.. ధరలు ఇప్పుడున్న స్థాయిలోనే కొంతకాలం స్థిరంగా ఉన్నా.. దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
15 రోజులకొకసారి చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షిస్తున్నాయి. తదుపరి సమీక్ష ఈ నెల 15న ఉండనుంది. కాగా, భారత్‌కు చమురు దిగుమతుల బిల్లు కూడా భారీగా తగ్గనుండటంతో ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా నిలవనుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.