పెట్రోలియం డీలర్ల నిరసన విరమణ
⇒ చమురు కంపెనీలతో డీలర్ల చర్చలు సఫలం
⇒ఓఎంసీ, సీఐపీడీ, ఏఐపీడీఏ మధ్య ఒప్పందం
⇒యథావిధిగా బంకుల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: కమీషన్ పెంపు వ్యవహరంపై చమురు కంపెనీలకు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య నెలకొన్న వివాదానికి తెరపడినట్లరుుంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు సంబంధించి కమీషన్ పెంపునకు చమురు సంస్థలు అంగీకరించడంతో తాము చేపట్టదలచిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీ.వినయ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం ముంబైలో చమురు కంపెనీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతకు ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ సింగిల్ షిఫ్ట్ విధానంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలు సాగిస్తామని, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ బంకులు మూసేస్తామని తీవ్ర నిర్ణయాలను పెట్రోలియం డీలర్లు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో వారు తమ నిర్ణయాలను ఉపసంహరించుకున్నారు.
కుదిరిన ఒప్పందం..
డీలర్ల మార్జిన్ పెంపు విషయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)లకు, కన్సార్టియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ), ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్(ఏఐపీడీఏ) మధ్య ఒప్పందం కుదిరింది. మోటర్ స్పిరిట్ కిలో లీటర్‌కు రూ.138, హైస్పీడ్ డీజిల్ కిలో లీటర్‌కు రూ.102ను డీలర్ మార్జిన్ కింద పెంచేందుకు అంగీకారం కుదిరింది. ఈ పెంపును నవంబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఓఎంసీ, సీఐపీడీ, ఏఐపీడీఏ సభ్యుల సంయుక్త కమిటీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌పై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ సంయుక్త కమిటీ డీలర్ రెమ్యునరేషన్, గతంలో జరిగిన తప్పుల పరిశీలనను నవంబర్ 15 కల్లా పూర్తి చేసి తగిన సిఫారసులు చేస్తుంది. కొత్త డీలర్ రెమ్యునరేషన్‌ను తదుపరి డీలర్ మార్జిన్ పెంపు సమయంలో అమలు చేస్తారు.
ప్రతీ ఆరు నెలలకొకసారి అంటే జనవరి 1, జూలై 1న డీలర్ మార్జిన్‌ను సవరించడం జరుగుతుంది. సవరించిన ఎన్ఎఫ్ఏ రిపోర్ట్‌ను నవంబర్ 30లోపు ఖరారు చేస్తారు. తదుపరి డీలర్ మార్జిన్ సవరణ సమయంలో ఈ రిపోర్ట్‌ను అమలు చేస్తారు. సిబ్బంది అధ్యయనాన్ని బయట ఏజెన్సీ చేత డిసెంబర్ 31 నాటికి ప్రారంభిస్తారు. హైస్పీడ్ డీజిల్ నష్టాల నివేదికను ఈ నెలాఖరుకల్లా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుంచి తెప్పించుకోవాలని నిర్ణయించారు. ఆ సంస్థ సిఫారసులను వచ్చే డీలర్ కమిషన్ సవరణ సమయంలో అమలు చేయాలని కూడా నిర్ణరుుంచారు. మోటర్ స్పిరిట్ నష్టాలపై అధ్యయనాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి చేపట్టి 2018 జనవరి 1 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.