సమాచారమే సరిగా లేదు.. ఆన్లైన్ సేవలెలా?
రాజన్న ఆలయ సమాచారం కావాలా? ఐతే వెబ్సైట్ తెరిచి చూస్తే సరిపోతుందిలే! అనుకుంటే పొరపాటే. ఎందుకంటారా..? అందులోని సమాచారం మనల్ని తప్పుదోవ పట్టించొచ్చు మరీ!! ఈ తప్పుడు సమాచారాన్ని స్థానికులు చూసి నవ్వుకుంటున్నారు.తెలంగాణకు తలమానికమైన ‘వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం’ అఫీషియల్ వెబ్సైట్ తెరిస్తే చాలు గదుల సమాచారంతోపాటు పూజలు, వాటి వివరాలు, టికెట్ల రేట్లు.. ఇలా మొత్తం సమాచారం తప్పుగానే దర్శనమిస్తోంది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్డేట్ చేయాల్సిన సదరు శాఖ మొద్దునిద్రను ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. ఏడాది క్రితం ఉన్న సేవలే కనిపించడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. అప్పటి నుంచి తాజా సమాచారాన్ని ఇందులో పొందుపర్చలేదు.
- న్యూస్‌లైన్, వేములవాడ
ఫస్ట్‌కాస్ మొదలు.. పీజీ విద్యార్థులు.. నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ స్థాయి వరకు ఇంటర్నెట్పై ఆధారపడుతున్న రోజులివి. వెబ్సైట్ తెరిస్తేచాలు.. ప్రపంచం కనబడుతోంది. అయితే రాజన్న ఆలయ సమాచారం మాత్రం వెబ్సైట్ లో తప్పుగా చూపిస్తోంది. గతేడాది రూమ్‌ల అద్దె ధరలే ఇప్పటికీ దర్శనమిస్తున్నా యి. ఆర్జిత సేవలతోపాటు ప్రతిదీ రేట్లు పెరిగాయి. అయినా సైట్లో మాత్రం అలా గే ఉన్నాయి. గతేడాదికి.. ఇప్పటికీ ఆలయంలో అనేక మార్పులు వచ్చాయి. అయినా అధికారులు మాత్రం అప్డేట్ చేయడంలో శ్రద్ధ చూపించడం లేదు.
ఏపీ ఆన్‌లైన్‌తో అనుసంధానం
ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ఆర్జేడీ స్థాయి ఈవోల సమావేశంలో నూతనంగా చేపట్టబోయే కొన్ని కార్యక్రమాలను దేవాదాయశాఖ కమిషనర్ వివరించారు. అందులో ప్రధానం ఏపీ ఆన్‌లైన్‌తో ప్రముఖ దేవాలయాల సమాచారాన్ని అనుసంధానించడం. భక్తులకు ఉచిత సేవచేసే ఉద్దేశంతో ఏపీ ఆన్లైన్ ఈతరహా సేవలకు సిద్ధపడినట్లు ఆయన ప్రకటించారు.ఆర్జిత సేవలూ, వసతి గదుల బుకింగ్ ఏపీ ఆన్లైన్ ద్వారా బుక్చేసుకునేందుకు వీలుగా సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈతప్పులతడక సమాచారాన్నే ఏపీ ఆన్‌లైన్‌లోనూ పొందుపరిస్తే అటు భక్తులకూ, ఇటు తక్కువ రేట్లకు సేవలు బుక్‌చేయటం వల్ల ఆలయానికీ నష్టం తప్పదన్నది ఇట్టే తేలిపోతుంది.
అన్ని ఆన్లైన్లోనే..
ఏపీ ఆన్లైన్ అనుసంధానంతోపాటు మరో ఉత్తర్వునూ ఈవోలు అందుకున్నారు. ఇన్నాళ్లూ కాగితాలపై సాగిన ఉత్తరప్రత్యుత్తరాలు ఇకపై ఉండవు. ఆలయాల్లో చేపట్టనున్న ఏ అభివృద్ధి పనులనైనా ల్యాప్‌టాప్ సహాయంతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేయాల్సిందే. ఇందుకు అవసరమైన అన్నిరకాల శిక్షణనూ ఆయా దేవాలయాల ఈవోలు పొందాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇంకేముంది రాష్ట్రంలోని 12 ప్రధాన ఆలయాల్లో ఒక్కటైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో సైతం రూ.50 వేలు వెచ్చించి నూతన ల్యాప్‌టాప్‌ను సమకూర్చుకున్నారు.