Phailin Tufan
-
కరెంటు కష్టాలకు తాత్కాలిక ‘విరామం’
సాక్షి, మచిలీపట్నం : విద్యుత్ ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు పడుతున్న కరెంటు కష్టాలకు విరామమిచ్చినట్లు అయ్యింది. ఫైలిన్ తుఫాన్, దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని సమ్మెను వాయిదా వేస్తున్నామని, ఇది తాత్కాలికమేమనని, కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మళ్లీ సమ్మెబాట పడతామని వారు ఘాటుగానే ప్రకటించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నోట్‌ను ఆమోదించడంతో విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగిన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో సుమారు 30వేల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే ట్రాన్స్‌కో ఉద్యోగులు సుమారు మూడు వేల మంది, జెన్కో ఉద్యోగులు సుమారు 5వేల మంది ఐదు రోజులుగా సమ్మెలో పాల్గొన్నారు. వీరి సమ్మెతో ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జిల్లాతోపాటు పొరుగు జిల్లాల్లోనూ విద్యుత్ సరఫరాపై తీవ్రప్రభావం పడింది. క్రమంగా విద్యుత్ కొరత తీవ్రం కావడంతో జిల్లాలో ఆరు గంటల నుంచి 12గంటలకు విద్యుత్ కోతలు పెరిగాయి. కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతూనే ప్రజలు ఉద్యమస్ఫూర్తితో సహకరించారు. జిల్లాలో 970గ్రామాలకు గానూ దాదాపు 600గ్రామాలకు పైగా మంచినీటి సరఫరాపై విద్యుత్ కోతలు తీవ్ర ప్రభావం చూపించాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో అరకొరగానే మంచినీటి సరఫరా చేసి సరిపెట్టారు. వీధిలైట్లు సైతం వెలగలేదు. జిల్లాలో అంతంతమాత్రంగా పనిచేస్తున్న సుమారు 571రైస్‌మిల్లులతోపాటు, 59ఐస్ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలో సుమారు 5వేల చిన్న, పెద్ద పరిశ్రమలకు విద్యుత్ కోతలు నష్టాల వాత పెట్టాయి. చిరువ్యాపారులు కరెంటు కోతలతో ఇబ్బంది పడ్డారు. సీమాంధ్రలో కోతలు.. తెలంగాణాలో వెలుగులు విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో కొత్త కోణం వెలుగు చూసింది. పాలకుల పక్షపాతం బయటపడింది. అసలు సంగతేమిటంటే విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర లో విద్యుత్ కోతలు విధించిన ప్రభుత్వం తెలంగాణా ప్రాంతంలో మాత్రం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసింది. గతంలో తెలంగాణా రాష్ట్రం కోసం ఆ ప్రాంతం లో పెద్ద ఎత్తున జరిగిన సకల జనుల సమ్మెలో అక్కడ విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. దీంతో అక్కడ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి తెలంగాణాలో కరెంటు కోతలు అమలు చేయాల్సి రావడంతో మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన కరెంటును అక్కడ సరఫరా చేసి అప్పుడు కూడా సీమాంధ్రలోనే కోతలు పెట్టారు. ఇప్పుడు జరిగిన సమ్మె తో ప్రభుత్వం తెలంగాణాకు కరెంటు కోతలు లేకుండా, సీమాంధ్రలోనే కోతలు అమలు చేసింది. తెలంగాణాలో సమ్మె జరిగినా, సీమాంధ్రలో ఉద్యమం జరిగినా కరెంటు కోతలు మాత్రం సీమాంధ్ర వాసులే భరించాల్సి రావడం శోచనీయమని ప్రజలు పేర్కొంటున్నారు. కరెంటు కోతలు తగ్గేనా.. విద్యుత్ ఉద్యోగులు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి విధుల్లోకి చేరనున్నారు. దీంతో సరఫరా దారిలోకి వస్తుందని అంటున్నారు. కాగా, వీటీపీఎస్ ఉత్పత్తి దారిలో పడటానికి మరో రోజు పడుతుందని చెబుతున్నారు. కరెంటు ఉత్పత్తి జరగడం, జిల్లాలో పలు సబ్స్టేషన్ల పరిధిలో సరఫరాకు గల అంతరాయాలు తొలగించాల్సి ఉంది. ఉద్యోగులు విధుల్లోకి చేరితే కరెంటు కోతలు ఒకటి రోజులు నామమాత్రంగానే అమలు చేసి, తరువాత పూర్తిస్థాయిలో కోతలు ఎత్తివేస్తారని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. -
స్థిరంగా కొనసాగుతున్న ఫైలిన్ తుపాన్
విశాఖ : తూర్పు మధ్య బంగాళాఖాతం ఏర్పడ్డ పైలిన్ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. ఈనెల 12న కళింగపట్నం వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉంది. కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే ప్రమాదమున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తా తీరంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కోస్తా, ఒరిస్సావరకు వేటకు వెళ్లిన మత్స్యకారులంతా వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు వాతావరణ శాఖ 9 జిల్లాలకు తుపాను హెచ్చరిక చేసిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుదని చెప్పారు. కాగా తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా తుపాను ప్రభావంపై సమీక్ష జరిపారు. -
ఫైలిన్ తుపానుపై అప్రమత్తం
* తుపానుకు ముందస్తు చర్యలు * కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు * టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0002 * ప్రతి మండలానికి ప్రత్యేకాధికారి నియామకం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌కు సమాచారం అందింది. దీంతో అధికారులను కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు అప్రమత్తం చేశారు. కలెక్టరేట్లో డిప్యూటీ తహశీల్దార్ నేతృత్వంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి నుంచి టోల్ ఫ్రీ నంబర్ 1800-4250-0002ను అందుబాటులో ఉంచారు. అర్ధరాత్రి నుంచే అన్ని చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఉన్న అన్ని పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అధికారులు, ఉద్యోగులందరూ సమైక్యాంధ్ర కోసం సమ్మెలో ఉన్నారు. కానీ సమ్మెలో ఉంటూనే అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. వీరితో పాటు మండలాధికారులు, వీఆర్వోలు, ఇతర ఉద్యోగులు అందుబాటులో ఉండాలని బుధవారం సాయంత్రం నుంచి అధికారులు సమాచారమందిస్తున్నారు. గత ఏడాదిలో వచ్చిన నీలం తుపాను కారణంగా జిల్లాలో చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పంటలు, ఆస్తి నష్టం తీవ్రంగా జరిగింది. కేవలం గ్రామాల్లోనే కాకుండా నగరంలో కూడా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ‘న్యూస్‌లైన్’ చెప్పారు. నగరంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవసరమైన అత్యవసర సామగ్రిని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. నేడు అత్యవసర సమావేశం తుపాను హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ సాల్మర్ ఆరోఖ్యరాజ్ గురువారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో మండలాధికారులు, తహశీల్దార్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. మండలాల వారీగా ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. మైదాన ప్రాంతాల్లోనే కాకుండా ఏజెన్సీలో కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి స్థానికులను సురక్షిత ప్రాంతలకు తరలించేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేయాలని ఆర్డీఓలను ఇప్పటికే ఆదేశించారు.