
స్థిరంగా కొనసాగుతున్న ఫైలిన్ తుపాన్
విశాఖ : తూర్పు మధ్య బంగాళాఖాతం ఏర్పడ్డ పైలిన్ తుపాను స్థిరంగా కొనసాగుతోంది. ఈనెల 12న కళింగపట్నం వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉంది. కళింగపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే ప్రమాదమున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తా తీరంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కోస్తా, ఒరిస్సావరకు వేటకు వెళ్లిన మత్స్యకారులంతా వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు వాతావరణ శాఖ 9 జిల్లాలకు తుపాను హెచ్చరిక చేసిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుదని చెప్పారు. కాగా తుపాను తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా తుపాను ప్రభావంపై సమీక్ష జరిపారు.