పేరుకు ముందు ‘డాక్టర్’ చేర్చాలి...
హైదరాబాద్: ఆరేళ్లపాటు చదివి డిగ్రీలను పొందినా కనీసం ప్రభుత్వ పరంగా చేయూత లేకపోగా... పట్టాలను జారీచేసిన విశ్వవిద్యాలయాలు తమ పేర్ల ముందు డాక్టర్ అనే పదాలను చేర్చేందుకు కూడా నిరాకరిస్తున్నాయంటూ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా డీ) విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం జేఎన్టీయూహెచ్ పరిపాలన భవనం ఎదుట వందలాది విద్యార్థులు ప్రభుత్వానికి, వర్శిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇచ్చే ప్రొవిజనల్, ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్లలో పేరుకు ముందు డాక్టర్ అనే పదాన్ని చేర్చాలని సూచించినప్పటికీ నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర చోట్ల పీసీఐ నిబంధనలకు అనుగుణంగా డాక్టర్ అనే పదాన్ని చేర్చి ధృవీకరణ పత్రాలను జారీ చేస్తుండగా ఓయూ, జేఎన్టీయూహెచ్లు మాత్రం పట్టించుకోకపోవడంపై తీవ్ర మనోవేదనను వ్యక్తం చేశారు. అనంతరం రిజిస్ట్రార్ యాదయ్యను కలిసి నెలరోజుల పాటు గడువు ఇస్తున్నామని తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మా డి డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్నాయక్, సత్యసునీల్, బారి నరేష్, అసోసియేషన్ ఫర్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అధ్యక్షుడు లక్ష్మికాంత్, జగదీశ్, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.