ఆ ఫార్మసీ కాలేజీల్లోనే ప్రవేశాలు
► పీసీఐ, ఏఐసీటీఈ, యూనివర్సిటీల అనుమతులు ఉండాల్సిందే
► నిర్ణయానికి వచ్చిన ఉన్నత విద్యా మండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల నిబంధనలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు పూర్తయింది. వివిధ కాలేజీల్లోని బీఫార్మసీ, ఫార్మ్–డి కోర్సుల్లో కన్వీనర్ కోటాలో లేదా మేనేజ్మెంట్ కోటాలో చేరేందుకు ఉండాల్సిన విధి విధానాలను కొలిక్కి తెచ్చింది. మూడు రకాల అనుమతులు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని, వాటినే ప్రవేశాల కౌన్సెలింగ్లో చేర్చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) గుర్తింపు పొంది, రాష్ట్రంలోని వర్సిటీలు అనుబంధ గుర్తింపు జారీ చేసిన కాలేజీ ల్లోనే ప్రవేశాలు చేపట్టనుంది.
ఇందుకోసం జూలైలో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీట్ల విషయంలోనూ నిబంధనలను ఖరా రు చేసినట్లు తెలిసింది. ఏఐసీటీఈ ఒక్కో కాలేజీకి ఇష్టారాజ్యంగా సీట్లకు అనుమతిచ్చింది. కానీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి కాలేజీలో ఒక్కో బ్రాంచీలో 100 సీట్లకు మించి ఉండటానికి వీల్లేదని తెలిపింది. దీంతో ఏఐసీటీఈ ఒక్కో బ్రాంచీలో 100 కు పైగా సీట్లకు అనుమతిచ్చినా, వర్సిటీలు 100కు పైగా సీట్లకు అనుబంధ గుర్తింపు జారీ చేసినా, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకా రం ఒక్కో కాలేజీ లో 100 సీట్లకు మించి భర్తీ చేయకూడదని, ఒకవేళ ఏఐసీటీఈ కానీ, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, యూనివర్సిటీలు కానీ సీట్లను తగ్గిస్తే ఆ తగ్గించిన సీట్లను పరిగణనలోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. వాటిలోనే ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.