‘రెస్ట్’ సంచలనం
► ఇరానీ కప్‌లో 480 పరుగుల లక్ష్య ఛేదన
► 4 వికెట్లతో ముంబై పై విజయం
► రాణించిన ఫజల్, నాయర్
ముంబై: బ్యాటింగ్‌లో సమష్టిగా చెలరేగిన రెస్టాఫ్ ఇండియా జట్టు... సంచలన విజయంతో ఇరానీకప్ గెలుచుకుంది. గురువారం ముగిసిన మ్యాచ్‌లో రెస్ట్ జట్టు 4 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. 480 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐదో రోజు బరిలోకి దిగిన రెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 6 వికెట్లకు 482 పరుగులు చేసి నెగ్గింది. దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇది మూడో అత్యధిక లక్ష్య ఛేదన. గతంలో 2010 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్ 536; 2004 దులీప్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో సౌత్‌జోన్ 501 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాయి. అయితే ఇరానీ చరిత్రలో మాత్రం ఇదే అత్యధికం కావడం గమనార్హం.
100/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఫయాజ్ ఫజల్ (127) సెంచరీతో స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ ఆడాడు. సుదీప్ చటర్జీ (54)తో కలిసి రెండో వికెట్‌కు 110; కరుణ్ నాయర్ (92)తో కలిసి మూడో వికెట్‌కు 130 పరుగులు జత చేశాడు. ఈ దశలో ముంబై స్పిన్నర్ ఇక్బాల్ అబ్దుల్లా స్వల్ప వ్యవధిలో ఫజల్, సుదీప్, నాయర్లను అవుట్ చేశాడు. దీనికి తోడు నమన్ ఓజా (29) అనూహ్యంగా రనౌటయ్యాడు. ఆఖరి సెషన్లో 35 ఓవర్లలో 159 పరుగులు చేయాల్సిన దశలో స్టువర్ట్ బిన్నీ (54), షెల్డన్ జాక్సన్ (59 నాటౌట్)లు చెలరేగిపోయారు. ఆరో వికెట్‌కు 56 నిమిషాల్లో 101 బంతుల్లో 92 పరుగులు జోడించారు. బిన్నీ అవుటైనా... జయంత్ (19 నాటౌట్)తో కలిసి జాక్సన్ విజయాన్ని పూర్తి చేశాడు.