ఒక్క నెల ఫోన్ బిల్లు రూ.5.06 లక్షలు
ముంబయి: భారత రాష్ట్రపతి భవన్లో నెలకు ఫోన్ బిల్లు ఎంత వస్తుందో మీకు తెలుసా.. అక్షరాల ఐదులక్షల రూపాయల పైమాటే. ఈ విషయం సాధారణంగా మనకు తెలియదు. కానీ, ఆ విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి ముంబయిలోని జోగేశ్వరీ ఏరియాకు చెందిన మన్సూర్ దర్వేశ్కు కలిగింది. వెంటనే సామాన్యుడి చేతిలో ఆయుధమైన సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించాడు. ఓ దరఖాస్తు నింపి పంపించి రాష్ట్రపతి భవన్ పూర్తి వివరాలు రాబట్టారు.
ఇందులో రాష్ట్రపతి నిలయం నిర్వహణ తీరు తెన్నులు, అందులు పనిచేసే ఉద్యోగుల సంఖ్య, భవన్కు కేటాయించిన బడ్జెట్, అందులో ఖర్చు చేసిన మొత్తం, అందులో పనిచేసే ఉద్యోగులకు చెల్లించే జీత భత్యాల వివరాలతోపాటు వ్యయాల వివరాలన్నీ తెలియజేశారు. ఇందులో భాగంగానే ఫోన్ బిల్లు వివరాలు కూడా వచ్చాయి. మార్చి నెలలో ఫోన్ బిల్లు రూ.4.25 లక్షలు రాగా, ఏప్రిల్ నెలలో రూ.5.06 లక్షల బిల్లు వచ్చింది. దీంతో అది చూసి నివ్వెరపోవడం ఆర్టీఐ దరఖాస్తుదారుని వంతైంది.
కాగా, 2012-13బడ్జెట్లో రూ.30.96 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. 2014-2015 బడ్జెట్లో రూ. 41.96 కోట్లు రాష్ట్రపతి భవన్కు కేటాయించారు. ఇక రాష్ట్రపతి భవన్లో మొత్తం 754 మంది ఉద్యోగులు ఉన్నారని వారిలో తొమ్మిది మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, 27 మంది డ్రైవర్లు, 64 మంది సఫాయికారులు ఉన్నారు. కాగా, వారిలో ఎనిమిదిమంది టెలిఫోన్ నిర్వహణ దారులు ఉన్నారు. కాగా, వీవీఐపీ అతిధుల కోసం కూడా ఈ బడ్జెట్ నుంచే ఖర్చు చేస్తామని ప్రత్యేక నిధి ఏమీ లేదని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది.