టెలిఫోన్ కేబుల్ దొంగలముఠా అరెస్టు
భూగర్భంలో వేసిన టెలిఫోన్ కేబుళ్లను చోరీ చేస్తున్న దొంగల ముఠాను దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో కేబుళ్లను వారు తస్కరిస్తుండగా ఎంటీఎన్ఎల్ అధికారులు వాళ్లను పట్టుకున్నారు. వాళ్ల వద్ద ఇలా చోరీ చేసిన దాదాపు 6 లక్షల రూపాయల విలువ చేసే కేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మొయిన్ (24), మంజీర్ ఆలం (25), మహ్మద్ షకీల్ (22), త్రివేణి సింగ్ (40)గా గుర్తించారు.
వాళ్లు కేవలం కేబుళ్లను ఎక్కడికక్కడ చోరీ చేయడమే కాదు, ఏకంగా వాటిని భూగర్భం నుంచి బయటకు లాగేందుకు ఉపయోగించే ఐషర్ కాంటర్ ట్రక్కు కూడా సొంతంగా సమకూర్చుకున్నారు. దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో దక్షిణ ఢిల్లీలోని తొమ్మిది వేర్వేరు పోలీసు స్టేషన్ల పరిధిలో కేబుల్ చోరీ కేసులు పరిష్కారం అయ్యాయని డీసీపీ బీఎస్ జైస్వాల్ తెలిపారు.