ట్రంప్ ఫోన్‌కాల్.. చైనా ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. తైవాన్ అధ్యక్షురాలు ట్సాయ్ యింగ్-వెన్‌తో ఫోన్లో మాట్లాడటంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా, తైవాన్‌ల మధ్య అధికారిక సంబంధాలను, మిలటరీ ఒప్పందాలను తాము వ్యతిరేకిస్తామని చైనా స్పష్టం చేసింది.
1979లో తైవాన్‌తో దౌత్య సంబంధాలను అమెరికా తెగదెంపులు చేసుకుంది. తైపీలో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఒకే చైనా పాలసీని ప్రకటించింది. ఆ తర్వాత అమెరికా, తైవాన్‌ల మధ్య అధికారిక చర్చలు కానీ ఎలాంటి ఒప్పందాలు కానీ జరగలేదు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. తైవాన్ అధ్యక్షురాలు ఫోన్లో మాట్లాడుకున్నారు. 37 ఏళ్ల తర్వాత అమెరికా, తైవాన్‌ల తొలి దౌత్య సంబంధం ఇదే. దీనిపై అమెరికా వివరణ ఇవ్వాలని చైనా కోరింది. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు తైవాన్ అధ్యక్షురాలు ఫోన్ చేసి అభినందించారు. ఆమెకు ధన్యవాదాలు’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.