ఆన్‘లైన్లో’ దొరికిపోతున్నారు!
► మోసగాళ్లను పట్టుకోవటానికి ఈ-కామర్స్ కంపెనీల సొంత ఏర్పాట్లు
► ఫోన్లపై ట్రాకింగ్; ప్యాకింగ్ డెలివరీ ప్రక్రియ రికార్డింగ్
► ఫ్లిప్‌కార్ట్‌కు టోపీ పెట్టిన హైదరాబాదీల పట్టివేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; హైదరాబాద్‌కు చెందిన నవీన్‌కుమార్ ఈ ఏడాది మొదట్లో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ కొన్నాడు. మర్నాడే డెలివరీ అయింది. కానీ తనపు ఫోన్ బదులు కాగితాలు, రబ్బరు వచ్చాయని చెప్పటంతో కంపెనీ డబ్బులు తిరిగిచ్చేసింది. కానీ ఆ ఫోన్ ఐఎంఈఐ నెంబర్‌ను ట్రాక్‌లో పెట్టింది. ఈ మధ్యే ఆ ఫోన్‌ను డెలాయిట్‌లో పనిచేసే మనీష్ శర్మ వాడుతుండగా పట్టుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మనీష్‌ను విచారించగా... తనకు నవీన్, అతుల్ అమ్మినట్లు చెప్పాడు. పోలీసులు వాళ్లిద్దరినీ పట్టుకోగా... ఫ్లిప్‌కార్ట్‌ను మోసం చేశామని అంగీకరించారు.
చిత్రమేంటంటే... అతుల్ అమెజాన్ ఉద్యోగి. నవీన్ అమెజాన్ మాజీ ఉద్యోగి.
ఓ వ్యక్తి ఆన్లైన్లో ఫోన్ కొన్నాడు. డెలివరీ బాయ్ నుంచి సంతకం పెట్టి మరీ తీసుకున్నాడు. కానీ తనకు ఫోన్ రాలేదని కంపెనీకి ఫిర్యాదు చేశాడు. ఆ కంపెనీ మరో ఉత్పాదనను పంపింది. అదీ రాలేదంటూ తిరిగి ఫిర్యాదు చేశాడు. కంపెనీ మళ్లీ మరో ఉత్పాదనను పంపింది. అప్పుడు కూడా కంపెనీని మోసం చేద్దామనుకున్నాడాయన. కాకపోతే కంపెనీ తన ఏర్పాట్లు తాను చేసుకుంది. డెలివరీ తీసుకుంటున్న వీడియోను రహస్యంగా రికార్డు చేయించింది. మోసం బయటపడటంతో మీ మెయిల్ ఐడీని బ్లాక్ చేస్తున్నామంటూ మెయిల్ పంపింది. ఇదంతా జరిగింది అమెరికాలో. కంపెనీ పేరు అమెజాన్.
కఠిన చర్యలు కూడా..
మోసం చేసిన కస్టమర్లపై ఈ-కామర్స్ కంపెనీలు ఏ చర్యలూ తీసుకోవటం లేదని, మెయిల్ ఐడీలను మాత్రమే బ్లాక్ చేస్తున్నాయని అనుకుంటే పొరపాటే. రూ.1.12 లక్షల కోట్ల విలువైన భారత ఈ-కామర్స్ రంగంలో కంపెనీలు ఒకడుగు ముందుకేసి కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. ఇందుకు స్మార్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఆ స్థాయిలో ట్రాకింగ్ వ్యవస్థనూ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందినీ నియమించుకున్నాయి. బిగ్ డేటాను ఆధారంగా చేసుకుని మోసగాళ్లను గుర్తిస్తున్నట్టు ఒక కంపెనీ ఉన్నతాధికారి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి వెల్లడించారు.
తగు ఆధారాలతో మోసగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారాయన. డెలివరీ బాయ్స్‌కు కెమెరాలనూ బిగిస్తున్నట్టు మరో కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని సందర్భాల్లో కంపెనీలు భారీ డిస్కవుంట్లు ప్రకటించినపుడు దాన్ని అమ్ముతున్నవారే కొనుగోలుదార్లలా కూడా మారి భారీగా లాభపడుతున్నారు. తప్పుడు చిరునామాలతో ఆర్డర్లిస్తున్నారు. కొన్నిసార్లు నకిలీ ఉత్పత్తులను అంటగడుతున్న విక్రేతలూ బయటికొస్తున్నారు. ఈ సందర్భాల్లో... వచ్చిన ఫిర్యాదులు, రేటింగ్ ఆధారంగా విక్రేతలను బ్లాక్ లిస్టులో పెడుతునన్నామని సదరు అధికారి తెలియజేశారు.
ఉద్యోగుల మోసాలు..
గతేడాదితో పోలిస్తే 2015లో ఉద్యోగుల మోసాలు 25% పెరిగాయి. ఇందులో 70% మంది ఈ-కామర్స్ కంపెనీలకు చెందిన వారేనని ఫోరెన్సిక్ రిస్క్ సొల్యూషన్స్ కంపెనీ క్రోల్ ఇండియా చెబుతోంది. ఈ-కామర్స్ రంగంలో జూనియర్, మిడిల్ మేనేజ్మెంట్ స్థాయిలో అట్రిషన్ రేటు నెలకు 15-20%గా టీఎంఐ గ్రూప్ డీజీఎం బి.అపర్ణరెడ్డి తెలిపారు. తాజా ఫ్లిప్‌కార్ట్ కేసులో 11 నెలల తర్వాత మోసగాళ్లను పట్టుకున్నారంటే... కంపెనీలు ఏ స్థాయిలో ‘వేట’ సాగిస్తున్నాయో అర్థంకాక మానదు. ఆన్లైన్ విక్రయాల్లో 40% వాటా మొబైల్స్‌దే కావటంతో... మోసాలు ఎక్కువగా వీటికి సంబంధించే ఉంటున్నాయి.
రిటర్న్ పాలసీని అలుసు చేసుకుని...
ఉత్పాదన నచ్చకపోయినా, సమస్య తలెత్తినా నెల రోజుల్లో దానిని వెనక్కి తిరిగి ఇచ్చేయవచ్చు. ఈ మేరకు రిటర్న్ పాలసీని ఈ-కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్నాయి. దీనిని కొందరు కస్టమర్లు, విక్రేతలతోపాటు ఈ-కామర్స్ కంపెనీల ఉద్యోగులూ అలుసుగా తీసుకుంటున్నారు. ఉత్పాదనకు బదులు రాళ్లు వచ్చాయంటూ మోసం చేస్తున్నారు. ఇటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి కంపెనీలు తమ గిడ్డంగుల్లో అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేసుకున్నాయి. కస్టమర్‌కు వెళ్లే ప్రతి ప్యాక్‌నూ స్కాన్ చేసి అందులో ఉత్పాదన ఉందని నిర్ధారించుకున్నాకే డెలివరీ చేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకిత్ నగోరి చెప్పారు. ఇటువంటి సందర్భాల్లో ఉత్పాదన రాలేదని తప్పుడు ఫిర్యాదు చేస్తే ఇట్టే దొరికిపోతారని మరో కంపెనీ ప్రతినిధి తెలిపారు.