కొత్త పరేషన్
ఆదిలాబాద్ అర్బన్ : కొత్త ఏడాదిలో ప్రజలకు కొత్త కష్టాలు వచ్చి పడేలా ఉన్నాయి. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పేరిట ఈనెల 31లోగా ఆహార భద్రత కార్డులు అర్హులకు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జిల్లాకు 6,69,554 ఆహార భద్రతా కార్డులు అందాయి. అధికారులు మండలాల వారీగా వాటిని పంపిణీ చేశారు. కాగా, జిల్లాలో 7.57 మంది లబ్ధిదారులు ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మిగతా లక్షా 76 వేలకు పైగా దరఖాస్తుదారులను అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు చెప్పకనే చెబుతున్నారు. అయితే.. ఈ ఆహార భద్రతా కార్డుల అలాట్మెంట్లోనే తహశీల్దార్ కార్యాలయ అధికారులు నిమగ్నమయ్యారు. వీటికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో విచారణ పూర్తికాగా.. పట్టణాల్లో ఇంకా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. కొత్త కార్డులు లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 88,500 మంది లబ్ధిదారులకు ఈ కార్డులు అందాయి. కార్డులు అందని కుటుంబాలు జనవరి నెల కోటా సరుకులు ఇప్పుడు తీసుకోవాలని ఆందోళన చెందుతున్నారు.
పరేషాన్ ఇలా..
ఆహార భద్రతా కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికీ వెళ్లి అధికారులు విచారణ చేపట్టారు. విచారణ పూర్తై గ్రామాల్లో లబ్ధిదారుల జాబితాను పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో ఉన్న వారు రెండు ఫొటోలు డీలర్లకు ఇవ్వాల్సిందిగా సూచించారు. మొన్నటి వరకు విచారణ చేపట్టిన అధికారులు ఆయా డీలర్ల ద్వారా లబ్ధిదారుల ఫొటోలను సేకరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా లబ్ధిదారుల ఫొటోల సేకరణే పూర్తి కాలేదు. ఇలా ఫొటోలను సేకరించిన డీలర్లు మండలాల అధికారులకు అందజేస్తారు. ఓ ఫొటోను కొత్త కార్డుపై అతికించి దానిపై కార్యాలయ స్టాంప్ వేయాల్సి ఉంటుంది.
కార్డుపై కుటుంబ సభ్యుల పేర్లు రాసి రిజిస్ట్రార్లో నమోదు చేసి తహశీల్దార్ సంతకం పెట్టి లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డు అందజేయాల్సి ఉంది. అయితే కొన్ని గ్రామాల్లో ఫొటోల సేకరణ ప్రారంభం కాలేదు. ఇందుకు మరో పదిహేను రోజులు సమయం పట్టవచ్చు. మరోపక్క అధికారులు కొత్త కార్డుల పంపిణీకి సిద్ధమవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
డిసెంబర్ 31లోగా లబ్ధిదారులకు ఆహార భద్రతా కార్డులు పంపిణీ చేసినట్లైతే జనవరి మొదటి నుంచి కోటా సరుకులు పొందుతారు. జనవరి 10 వరకు పంపిణీ పూర్తి చేస్తామని, 15 వరకు కోటా సరుకులు తీసుకోవచ్చని, కార్డు అందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సి అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.