ఎడబాటు
ఫొటో స్టోరీ
కొరియా రెండుగా చీలిపోయినప్పుడు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి. ఎన్నో బంధాలు తెగిపోయాయి. తమవారు అవతల, తాము ఇవతల ఉండటాన్ని తలచుకుని కొన్ని లక్షల మంది కుమిలిపోయారు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడివారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రావడం వీలు కాలేదు. ఎప్పుడో ఒకసారి తప్ప తమవారిని చూసుకునే అవకాశం కలిగేది కాదు. దాంతో ఆ యెడబాటు వారి గుండెల్ని పిండేసేది. ఈ ఫొటోలోని వ్యక్తి కూడా ఆ వేదన అనుభవించినవారే!
దేశ విభజన కారణంగా ఈయన తన సోదరుడికి దూరమయ్యారు. తను ఎలా ఉన్నాడో, తన కుటుంబం ఎలా ఉందోనని ఆవేదన చెందుతూ దశాబ్దాల పాటు బతికారు. యాభయ్యేడేళ్ల తర్వాత... తన సోదరుడిని కలుసుకునే అవకాశం వచ్చిందాయనకు. 2010లో ఒక రోజున... ఎప్పుడో దూరమైన తన తమ్ముడిని చూసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రేమగా వాటేసుకుని మంచీ చెడులు మాట్లాడారు.
కొన్ని గంటలపాటు తనతో గడిపి ఆనందపడ్డారు. అయితే అతడు తిరిగి ప్రయాణమయ్యే సమయం ఆసన్నమయ్యేసరికి దిగులు కమ్ముకుంది. కదిలిపోతున్న రైలులో కూర్చుని తమ్ముడు చేయి ఊపి వీడ్కోలు చెబుతుంటే... బాధ పొంగి కళ్లలోకి వచ్చింది. బహుశా తన తమ్ముడిని తాను మరోసారి చూడలేనేమో, అతడు మళ్లీ వచ్చేనాటికి తాను ప్రాణాలతో ఉండనేమో అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోన్న ఈ వృద్ధుడి వేదనను ఓ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. కొరియా విభజన మిగిల్చిన చేదును ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు!