పరిణామం చిన్నది... పని పెద్దది!
ఆవగింజ
గుడ్ఫుడ్
పరిమాణంలో చాలా చిన్నగా కనిపించే వాటిని ఆవాలతో పోలుస్తూ ఆవగింజంత అంటారు. కానీ వాటి వల్ల కలిగే లాభాలు మాత్రం కొండంత. ఆవాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... ఆవాల్లో ఉండే ఫోటోన్యూట్రియెంట్ గుణాలు, పీచుపదార్థాల కారణంగా అవి జీర్ణవ్యవస్థకు మేలు చేయడంతో పాటు, జీర్ణవ్యవస్థలో వచ్చే అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. మలబద్దకం కూడా తగ్గుతుంది. ఆవాల్లో సెలీనియమ్, మెగ్నీషియమ్ ఎక్కువ. వాటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి.ఆవాలు ఆస్తమాను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఆవాలతో కూడిన ఆహారం తినేవాళ్లలో ఆస్తమా అదుపులో ఉండటంతో పాటు జలుబు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి సమస్యలు తగ్గుతాయి.
బరువు తగ్గడానికి ఆవాలు బాగా తోడ్పడతాయి. ఆవాలలో విటమిన్ బీ–కాంప్లెక్స్ ఎక్కువ. దాంతో వ్యాధి నిరోధక శక్తి సమకూరడమే కాకుండా, జీవక్రియలు సమర్థంగా జరుగుతాయి. ఆవాలలోని కెరోటిన్స్, జియాగ్జాంథిన్స్, ల్యూటిన్ వంటి పోషకాలు వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలను తగ్గించి దీర్ఘకాలం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి. ఆవాల్లోని నియాసిన్ వంటి పోషకాల వల్ల కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గుతాయి. రక్తనాళాల్లో పాచిలాగ పేరుకునే అథెరోస్కి›్లరోసిస్ వంటి కండిషన్లను ఆవాలు నివారిస్తాయి. ఆవాల్లోని విటమిన్–ఏ, ఐరన్, ఫ్యాటీ యాసిడ్లు జుట్టు దట్టంగా పెరగడానికి తోడ్పడతాయి. ఆవాలు రక్తపోటును సమర్థంగా తగ్గిస్తాయి.