కుక్కలు, పందుల బాధపై అసెంబ్లీలో చర్చ!
రాష్ట్ర అసెంబ్లీలో కుక్కలు, పందుల విషయం చర్చకు వచ్చింది. విశాఖపట్నంలో కుక్కల గురించి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్రస్తావిస్తే, కర్నూలులో పందుల బెడదను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. విశాఖపట్నం నగరంలో లక్షకు పైగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఇప్పటివరకు అవి దాదాపు 2 వేల మందిని కరిచాయని ఆయన చెప్పారు. ఒక రకంగా చూస్తే.. కుక్కల కంటే దొంగలే మేలు అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మధ్యలో కూడా కుక్కలు వచ్చాయని గుర్తు చేశారు. కుక్కల బారి నుంచి తమన నగర వాసులను వెంటనే రక్షించాలని కోరారు.
అలాగే, కర్నూలు నగరంలో పందుల బెడద తీవ్రంగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. ముగ్గురు పిల్లలను పందులు కరిచి చంపేశాయని చెప్పారు. అవి కనిపిస్తే కాల్చిచంపేయాలన్న ఉత్తర్వులున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, పందుల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనికి మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ, రాష్ట్రంలో 3.47 లక్షల కుక్కలు ఉంటే, ఒక్క విశాఖపట్నంలోనే 1.39 లక్షల కుక్కలు ఉన్నాయని తెలిపారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కుక్కలను చంపడానికి వీల్లేదని, అందువల్ల స్టెరిలైజేషన్ ద్వారా కుక్కలను నియంత్రిస్తున్నామని సమాధానం చెప్పారు.