కర్నూలు ఆస్పత్రికి పైలా
అనంతపురం మెడికల్ : అనారోగ్యంతో బాధపడుతున్న తాడిపత్రి నేత పైలా నర్సింహయ్యకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో ఆయన శనివారం అనంతపురం సర్వజనాస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఓ కేసులో నిందితుడైన పైలా గత నెల 21న తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్యం ఉండడంతో అదే నెల 22న తెల్లవారుజామున సర్వజనాస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి వైద్య చికిత్సలు పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు రెఫర్ చేసిన వైద్యులు.. ఆ తర్వాత రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నారు. ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందంటూ పైలా ఆహారం తీసుకోకుండా నిరసన వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం పలు వైద్య పరీక్షలు నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యం శనివారం కూడా కొన్ని పరీక్షలు చేసింది. జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు ఇప్పటికే పైలా ఆరోగ్యంపై నివేదికను అందజేశారు. తాజాగా శనివారం సర్జికల్ హెచ్ఓడీ డాక్టర్ రామస్వామినాయక్, సైకియాట్రి హెచ్ఓడీ డాక్టర్ యెండ్లూరి ప్రభాకర్‌తో సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ సమావేశమయ్యారు. గతంలో పైలా నర్సింహయ్య చేయించుకున్న వైద్యానికి సంబంధించిన రిపోర్టులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పైలాకు మానసిక సమస్య కూడా ఉన్నట్లు యెండ్లూరి ధ్రువీకరించారు. ‘మల్టిపుల్’ కంప్లైంట్స్ ఉన్న నేపథ్యంలో అపెండిసైటిస్, ఛాతీలో నొప్పి, మానసిక సమస్యకు మెరుగైన వైద్యం అవసరమని నిర్ణయానికి వచ్చి కర్నూలుకు సిఫార్సు చేశారు.