నాలుగు కోట్ల మందికి ఏర్పాట్లు
కలెక్టర్ కాంతీలాల్ దండే
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. పుష్కరాలకు సంబంధించి గుంటూరు జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, వ్యాపార సంఘాలు, అధికారులతో గురువారం రాత్రి జెడ్పీ సమావేశ మందిరంలో ఓపెన్ ఫోరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాలుగు కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసేందుకు వీలుగా రూ.1600 కోట్లతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా..
జిల్లాలో ఘాట్ల నిర్మాణాలు, పుష్కర నగర్లు, పుష్కర భక్తులకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 3.856 కిలోమీటర్ల మేర 80 ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 25 ప్రధాన ఘాట్లలో 29 పిండి ప్రదాన షెడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 14 పుష్కరనగర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కర నగర్లో రోజుకు 15 వేల మందికి భోజన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
వైద్య సేవలు
పుష్కరాలకు జిల్లాలో ఆరు చోట్ల పది పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సత్తెనపల్లి, మాచర్ల, గురజాల, అమరావతి, రేపల్లె, గుంటూరులలో వీటిని తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ 905 బస్సులు, 112 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పుష్కరాలు జరిగే 12 రోజులపాటు గుంటూరు కార్పొరేషన్‌తో పాటు, పుష్కరాలు జరిగే మున్సిపాలిటీల్లో సైతం ప్రైవేటు పోస్టర్లు అనుమతించవద్దని కమిషనర్లను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అతుకూరు ఆంజనేయులు, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, కమిషనర్ నాగలక్ష్మి, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, డీఆర్వో నాగబాబు, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.