యనమల కరడుగట్టిన నియంత: బోస్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు, నియంత హిట్లర్‌కు చాలా దగ్గరి పోలికలున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. యనమల కరడుగట్టిన నియంత అని, ఆయన పోకడల గురించి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. దివంగత ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయడంలో చంద్రబాబుతో కలసి యనమల కుట్ర పన్నడమే కాక.. ఆనాడు నిండు అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను కన్నీళ్లు పెట్టించారని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశమివ్వాలని ఎన్టీఆర్ ఎంత ప్రాధేయపడినా స్పీకర్‌గా ఉన్న యనమల ఘోరంగా అవమానపరిచారన్నారు.
సభా సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కిన యనమల తమ అధినేతను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు బోస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘టీడీపీని విడిచి వెళ్లిన వారు తిరిగి పార్టీలోకి రావాలని చంద్రబాబు అనేకసార్లు బహిరంగంగానే పిలుపునిచ్చారు. కొందర్ని పార్టీలోకి రప్పించడానికి పారిశ్రామికవేత్తలైన సీఎం రమేష్, సుజనాచౌదరి లాంటివారు మంతనాలు సాగిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. వాటినే ‘సాక్షి’ ప్రచురిస్తే భుజాలు తడుముకుంటూ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదం’ అని అన్నారు. ఎవరెన్ని రకాలుగా వ్యక్తిగత దూషణలకు పాల్పడినా విజ్ఞులైన ప్రజలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుంటారని, రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు.