నగరానికి దమణ్గంగా, పింజార్ నదీ జలాలు
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. తాగునీటి కష్టాలనుంచి త్వరలో కొంతమేర ఉపశమనం లభించనుంది. ఇందుకు కారణం ఖాందేశ్ పరిధిలోని దమణ్ గంగా, పింజార్ నదులను అనుసంధానించి నగరానికి నీటిని సరఫరా చేసేందుకు అనుమతించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక మంజూరు ఇచ్చింది. దాదాపు రూ.12 వందల కోట్లు ఖర్చుకానున్న ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే డిమాండ్ చేశారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి అధ్యక్షతన మూడు రోజులుగా జరుగుతున్న ‘జల్ మంథన్’ చర్చ సమావేశంలో పాల్గొన్న ఖడ్సే ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోయారు. నగరంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు దమణ్గంగా, పింజార్ నదులను అనుసంధానం చేయడమొక్కటే సరైన మార్గం. ఈవిధంగా చేయడం ద్వారా 40-60 టీఎంసీల నీరు నగరానికి తీసుకురావడం సాధ్యమవుతుంది. ఇందువల్ల 25-50 సంవత్సరాల వరకు తాగు నీటి సమస్య తలెత్తదని ఖడ్సే అభిప్రాయపడ్డారు. ఇందుకు ఉమా భారతి సానుకూలంగా స్పందించారు. తాత్కాలికంగా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.1200 కోట్లు ఖర్చవుతాయని అంచనావేశారు.