అతనికి గుణపాఠం చెప్పా!
జీవితంలో తప్పొప్పులు, ఎత్తుపల్లాలు ఎవరికైనా సహజమే. రెంటినీ సమానంగా తీసుకుంటే జీవితం బాగుంటుంది. సక్సెస్‌కి సంతోషడి, ఫెయిల్యూర్‌కు డీలా పడిపోకూడదు. ఉదాహరణకు తాప్సీని తీసుకుంటే, సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ‘ఐరన్ లెగ్’ అనిపించుకున్నారామె. అప్పుడు ధైర్యం సన్నగిల్లి వెనక్కి వెళ్లిపోయుంటే ఇప్పుడు బాలీవుడ్ వరకూ వెళ్లగలిగేవారు కాదు. తెలుగులో సక్సెస్‌లు చూశాక, హిందీలోకి వెళ్లి అక్కడ కూడా విజయాలు చూస్తున్నారు. ‘పింక్’ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ కూడా సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఈ ఢిల్లీ బ్యూటీ ఓసారి తన జీవితాన్ని విశ్లేషించుకున్నారు. లైఫ్‌లోని తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు.
నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు మోడల్‌గా చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలో నా ఎక్స్ట్రా పాకెట్‌మనీకి ఇదొక మంచి అవకాశమని భావించాను. ఎమ్.బి.ఏ చదవడానికి క్యాట్ ఎగ్జామ్‌లో 88 పర్సంటేజ్ సాధించాను. అనుకోకుండా అప్పుడే నాకు సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. రెండూ ఒకేసారి రావడం ఆనందంగా ఉన్నా, దేన్ని ప్రిఫర్ చేయాలా అని కొంచెం సతమతమయ్యాను. చివరికి మనసు చెప్పిందని యాక్టింగ్‌కే ఓటేశాను. ఆ తర్వాత నేను నటించిన సినిమాలు సరిగా ఆడలేదు. కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమని నన్ను నేను ఓదార్చుకున్నాను. అయితే ఓ విషయం నన్ను తీవ్రంగా బాధించింది. నా మీద ‘ఐరన్ లెగ్’ ముద్ర వేశారు. ఫ్లాప్ అయిన ఆ సినిమాలు స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ల కాంబినేషన్లో వచ్చినవే. వాళ్లను వదిలేసి నా దురదృష్టం మూలానే సినిమాలు హిట్ కాలేదని కొందరు నిందించారు. అయినా భరించాను. ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు.
నా సహనాన్ని ఏ స్థాయిలో పరీక్షించారంటే.. పారితోషికం తగ్గించుకోమని నన్ను కొందరు నిర్మాతలు అడిగారు. నేను సమాధానం చెప్పేలోపే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించేవారు. కొందరు నిర్మాతలు తమ ఆర్థిక ఇబ్బందులను కూడా నా దురదృష్టంతో ముడిపెట్టి మాట్లాడితే ఏం చేయాలో అర్థంకాక మౌనంగా ఉండేదాన్ని. అయితే ఇదంతా బాలీవుడ్లో నేను నటించిన ‘పింక్’ సినిమా విడుదలకు ముందు జరిగింది. మొదట్లో తెలుగు పరిశ్రమలోలానే హిందీ పరిశ్రమలోనూ నేను విమర్శలకు గురయ్యాను.
హిందీలోకి వెళ్లిన కొత్తలో నేను టాప్ హీరోయిన్ని కాదని కొందరు టాప్ హీరోలు నాతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. అదొక బాధ అయితే ఓ సినిమాకి నా డేట్స్ తీసుకుని, ఆ తర్వాత ఎవరో టాప్ హీరోయిన్ డేట్స్ దొరికాయని నన్ను పక్కన పెట్టిన నిర్మాతలు కూడా ఉన్నారు. చివరకు ఇండస్ట్రీలో నాకు రావాల్సిన పారితోషికం అమాంతం తగ్గిపోయింది. బేసిక్ పే కోసం పోరాడాల్సిన దుస్థితి వచ్చిందంటే నమ్మరు. అయినా ఎవర్నీ నిందించలేదు.
ఇన్ని చేదు అనుభవాలు ఎదురైనా ఇండస్ట్రీలో ఉన్నానంటే అందుకు కారణం.. నాకు నటన అంటే ప్రాణం, గౌరవం, అభిమానం. నేను గ్లామరస్ యాక్ట్రస్ను కాకపోవచ్చు. సరైన శరీరాకృతి లేదని కొందరు నిందలు వేయవచ్చు. అయినా బాధపడను. వారిని నమ్ముకుని యాక్టింగ్ ఫీల్డ్కి రాలేదు. నా ప్రతిభ మీద నమ్మకంతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఎవరి మీదా ఆధారపడకుండా స్వేచ్ఛగా, స్ట్రాంగ్‌గా బతకాలనుకుంటాను.
కొన్ని వారాల క్రితం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొ నేందుకు వెళ్లాను. అక్కడ జనం తాకిడి భారీగా ఉండటంతో కొంత ఇబ్బందిపడ్డాను. సడన్‌గా ఎవరో వెనుకనుంచి నన్ను వేలితో తాకేందుకు ప్రయత్నించాడు. చాలా కోపం వచ్చింది. ఆ వ్యక్తి ముఖం కూడా చూడకుండానే అతని వేలుని పట్టుకుని లాగి, మెలి తిప్పి గుణపాఠం చెప్పాను. రీల్ లైఫ్‌లో హీరోయిన్ అయినా ఈ సంఘటన పరంగా మాత్రం నేనే హీరోని.