గిన్నీస్లో పిన్నీస్
చీర కుచ్చెళ్లు జారొద్దన్నా, మెడలోని పుస్తెలు కదలొద్దన్నా, శిగలోని పువ్వులు ఊడొద్దన్నా... అరికాల్లోకి చొచ్చుకున్న ముల్లు బయటకి రావాలన్నా... పంటిలో ఇరుక్కున్న ఆహారం లాగాలన్నా... పిల్లల చెడ్డీలు లూజయ్యాయన్నా, షర్ట్ బొత్తాములు ఊడిపోయాయన్నా... వెంటనే గుర్తు కొచ్చేది ‘పిన్నీస్’. మరి మీరు ఇప్పటి దాకా ఎన్ని పిన్నీస్‌లు వాడుంటారు? లెక్కలేదు కదూ! బట్టల తీగలకు, ఇంటి చూరులకు, పాత దుస్తులకు, మొలతాడులకు, మంగళసూత్రాలకు, చేతికి కట్టుకున్న కాశీతాడులకు ఇలా ఎక్కడో చోటా, నిత్యం తారసపడే పిన్నీస్‌లు... ఎన్ని కొన్నా... అవసరానికి మాత్రం కానరావు. అందుకే షాపింగ్ చేసిన ప్రతీ సారి ఓ డజను పిన్నీస్‌లు కొని తెచ్చుకుంటాం. కానీ, మళ్లీ మామూలే. ఇలా ప్రతీ అవసరానికీ విరివిగా ఉపయోగించే సేఫ్టీ పిన్ (పిన్నీస్) పుట్టిన రోజు ఎప్పుడో
మీకు తెలుసా? అప్పట్లోనే 400 డాలర్లు పలికిన పిన్నీస్
పెన్, మిషన్, రైఫిల్ వంటి ఎన్నో ఆవిష్కరణలు చేసిన అమెరికన్ శాస్త్రవేత్త వాల్టర్ హంట్, తన స్నేహితుడు చార్లెస్ రోల్ (బర్మింగ్‌హామ్, ఇంగ్లాండ్)కి తీర్చాల్సిన 15 డాలర్ల కోసం, 1849 ఏప్రిల్ 10న సేఫ్టీ పిన్ను రూపొందించారు. తరువాత 400 డాలర్లకు పిన్నీస్ పేటెంట్ హక్కులను ‘డబ్యూ.ఆర్.గ్రేస్ అండ్ కంపెనీ’కి అమ్మేశాడు. దాని విలువ 2008 నాటి లెక్కల ప్రకారం 10,000 డాలర్లకు సమానం. ప్రస్తుతం మన కరెన్సీలో చెప్పాలంటే... ఆరున్నర లక్షల పైనే.
గిన్నీస్లో పిన్నీస్
కొందరు తమదైన శైలిలో, తమదైన ప్రాధాన్యతను కాపాడుకోవడానికి తాపత్రయపడుతుంటారు. వింతలు, విడ్డూరాలు చేస్తూ రికార్డులకు ఎక్కుతుంటారు. అలా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న అమెరికన్–మిషా కాలిన్స్.. అతి పొడవైన పిన్నీస్ల ఛైన్ తయారు చేసి ఔరా అనిపించాడు. కెనడాలో బ్రిటిష్ కొలంబియాలో బుర్నబిలోని సెంట్రల్ పార్క్‌లో 2013 ఆగస్టు 15న గిష్వెస్ ఈవెంట్లో పాల్గొని పిన్నీసులతో 3,582 అడుగుల ఛైన్ తయారు చేశాడు. దీని కోసం 43,098 పిన్నీస్‌లు ఉపయోగించి రికార్డ్ సృష్టించాడు.
ట్రంప్‌పై పిన్నీస్ వార్
వివాదాస్పద వ్యాఖ్యలతోనే అమెరికాను ఏలుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పిన్నీసుల ఉద్యమం చేస్తున్నారు అక్కడ నిరసనకారులు. అమెరికాలో జరుగుతున్న ఘర్షణలకు ఆందోళన చెందుతున్న పలువురు ముస్లింలు, మహిళలు, లాటినోస్ తమ దుస్తులపై సేఫ్టీ పిన్ ధరించి నిరసన తెలుపుతున్నారు. పిన్నీస్ ఉన్న పిక్స్‌ను పోస్ట్ చేస్తూ, లైక్స్ కొడుతూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
సెప్టిక్ పిన్
పిన్నీస్ కొత్తదైతే ప్రమాదం లేదు, అదే కాస్త తుప్పుపడితే... దానికి మించిన ప్రమాదం మరోటి లేదు. అందుకే తుప్పు పట్టిన పిన్నీస్‌లు వాడకపోవడమే మేలు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదవశాత్తు పిన్నీస్ గాయాలకు గురైన వారి సంఖ్య కూడా ఎక్కువే. బ్రిటన్‌లో 2002లో పిన్నీస్ గాయాలతో 103 మంది ఆసుపత్రిలో చేరినట్లు ఓ అంచనా.
ప్రథమ చికిత్సకు పిన్నీస్
సేఫ్టీ పిన్ వైద్యానికి చిన్నపాటి కత్తెర లాంటిదే. ప్రమాదాల బారిన పడినవారికి ప్రథమ చికిత్స సమయంలో అవసరమనిపిస్తే కొత్త పిన్నీస్లను యూజ్ చేస్తారు. ఈ క్రమంలోనే హెల్త్ అండ్ సేఫ్టీ కోసం ఫస్ట్–ఎయిడ్ బాక్స్‌లో కనీసం 6 సేఫ్టీ పిన్స్ అయినా ఉండాలని నిపుణులు రికమెండ్ చేస్తారు.
మీసాలపై పిన్నీసులు నిలబెట్టి...
కొత్తగా ఏదో చెయ్యాలి, పదిమంది చేత వావ్ అనిపించుకోవాలని కోరుకుంటారు కొందరు. అలాంటి జాకబ్ విలియమ్స్ అనే ఔత్సాహికుడు తన మీసం, గెడ్డాలపై పిన్నీసులు వేలాడదీశాడు. 2015 ఆగష్టు 28న కెనడాలో ఒకటీ రెండు కాదు, ఏకంగా 202 పిన్నీస్లను విరివిగా నిలబెట్టి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు.
– సంహిత నిమ్మన