ఫిన్లాండ్ కంపెనీపై మదర్సన్ కన్ను
• పీకేసీ గ్రూప్ కొనుగోలుకు
• రూ. 4,146 కోట్ల ఆఫర్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరికరాల తయారీ దిగ్గజం మదర్సన్ సుమి సిస్టమ్ .. అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఫిన్లాండ్కి చెందిన ట్రక్ వైర్ హార్నెస్ తయారీ సంస్థ పీకేసీ గ్రూప్ కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికోసం 571 మిలియన్ యూరోలు (సుమారు రూ. 4,146 కోట్లు) చెల్లించనుంది. పీకేసీ షేరు ఒక్కింటికి 23.55 యూరోలు ఆఫర్ చేసినట్లు మదర్సన్ తెలిపింది.
గురువారం నాటి పీకేసీ షేరు ధరతో పోలిస్తే ఇది 51 శాతం అధికం. మార్చి ఆఖరు నాటికి డీల్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్‌కి తాము మద్దతునిస్తున్నట్లు పీకేసీ మరో ప్రకటనలో తెలిపింది. ఇరు కంపెనీల విలీనంతో అంతర్జాతీయ రవాణా రంగానికి అవసరమైన వైరింగ్ సిస్టమ్స్, పరికరాల తయారీ సంస్థగా ఆవిర్భవించవచ్చని పేర్కొంది. అమెరికా, యూరప్ వాణిజ్య వాహనాల మార్కెట్లలో మదర్సన్ .. ఆసియా పసిఫిక్ ప్రాంత మార్కెట్లో పీకేసీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఈ డీల్ తోడ్పడనుంది.