2న మహా శ్రమదానం
ఎస్సీ రైల్వే జీఎం శ్రీవాస్తవ వెల్లడి
సాక్షి,సిటీబ్యూరో: ప్రయాణికులకు అత్యుత్తమ సదుపాయాలు అందజేయడమే దక్షిణ మధ్య రైల్వే లక్ష్యమని జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఇరువై నాలుగు గంటల పాటు స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తరహాలో అన్ని స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు పేర్కొన్నారు. ‘స్వచ్ఛభారత్ మిషన్’లో భాగంగా అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున దక్షిణమధ్య రైల్వే జోన్ అంతటా మహాశ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.
సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైల్వే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది,స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను కలుపుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జోన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లు, ట్రాక్‌లు, అధికారుల నివాస స్థలాలు, కాలనీలు శుభ్రం చేస్తామన్నారు. పరిశుభ్రత విషయంలో ఉల్లంఘనలకు పాల్పడే ప్రయాణికుల పై రూ.500 చొప్పున జరిమానా విధిస్తామన్నారు. రైళ్లలో పరిశుభ్రత కోసం ప్రవేశపెట్టిన బయోటాయిలెట్ వ్యవస్థ ఎంతో ప్రయోజనకరంగా ఉందని, ఇప్పటి వరకు 383 బోగీలలో 1183 బయోటాయిలెట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దసరా,దీపావళి సందర్భంగా ఈ ఏడాది 299 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని చెప్పారు.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, కాకినాడ, మచిలీపట్నం, గౌహతి, గోండియా,తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయన్నారు. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా ప్రయాణికులు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్లేందుకు ప్రవేశపెట్టిన జనసాధారణ్ రైళ్లకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ప్రయాణికుల భద్రత కోసం, దొంగతనాలు, నేరాలను అరికట్టేందుకు అక్టోబర్ 2వ తేదీ నుంచి హెల్ప్‌లైన్ 1322 ను అందుబాటులోకి తేనున్నట్లు జీఎం శ్రీవాస్తవ చెప్పారు.