ప్లేస్మెంట్ ఏజెన్సీలపై నివేదిక ఇవ్వండి
ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరిన జాతీయ మానవ హక్కుల సంఘం
సాక్షి, న్యూఢిల్లీ: మనుషుల అక్రమ రవాణాలో ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ప్లేస్మెంట్ ఏజెన్సీల పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులను జాతీయ మానవ హక్కుల సంఘం గురువారం ఆదేశించింది. గుర్తింపు పొందిన, పొందని ప్లేస్మెంట్ ఏజెన్సీల వివరాలు, వాటిపై పర్యవేక్షణ గురించి రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను ఢిల్లీ పోలీస్ కమిషనర్ తమకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అనుమతి లేని ప్లేస్మెంట్ ఏజెన్సీల ద్వారా ఢిల్లీ కేంద్రంగా మనుషుల అక్రమ రవాణా జరుగుతోందని, వాటిపై చర్యలు తీసుకోవాలని మీడియాలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో మానవ హక్కుల కమిషన్ దీనిని సుమోటా కేసుగా స్వీకరించింది. కాగా, ఇతర దేశాలకు అక్రమంగా కూలీలను రవాణా చేసే వ్యాపారంలో వందలాది కంపెనీల భాగస్వామ్యం ఉంది. గిరిజనులు, మహిళలు, పిల్లలను గ్రామీణ ప్రాంతాల నుంచి మాయ మాటలు చెప్పి విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు విస్తృతంగా వినిపిస్తున్నాయి.