ఎన్ని ప్లాన్లు బాబోయ్!
పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణసంకటంలా తయారైంది భోగాపురంలో ఎయిర్‌పోర్టు వ్యవహారం. ప్లాన్-1, ప్లాన్-2 అంటూ ఎయిర్‌పోర్టుపై రోజుకో అలైన్మెంట్తో స్పష్టత లేని ప్రభుత్వ ప్రకటనలు..భోగాపురం మండల ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక్కో మంత్రి ఒక్కోరకంగా ప్రకటిస్తూ అధికారుల్ని కూడా గందరగోళంలో పడేస్తున్నారు. ఇంతవరకూ భూసమీకరణ నోటిఫికేషన్ ఇవ్వలేదు. కానీ, లక్ష్యాలు నిర్దేశించి సర్వే సిబ్బందిని గ్రామాల్లోకి పంపిస్తున్నారు. అక్కడ ప్రజలు తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తున్నారు. చివరికి అధికారులను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధపడ్డారు. ఎయిర్‌పోర్టుకు కావాల్సిన స్థలంపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడంతో మధ్యలో తాము నలిగిపోతున్నామని సర్వే, రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 15వేల ఎకరాలు సేకరిస్తున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన ప్రకటించారు. అయితే ఎయిర్‌పోర్టును కేవలం 6వేల ఎకరాల్లోనే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మే 3వ తేదీన స్వయంగా ప్రకటన విడుదల చేసి వెల్లడించారు. ఆ మరుసటి రోజున విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లతో విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అదే ప్రకటన చేశారు. మే 13న జిల్లాకొచ్చిన పురపాలక మంత్రి పి.నారాయణ ఎయిర్‌పోర్టుపై చేసిన సమీక్షలో 5వేల ఎకరాలైతే సరిపోతాయని, ఆమేరకు భూ సమీకరణ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు తమకు సూచించారని చెప్పారు. ఆ తర్వాత మే 15వ తేదీన కలెక్టర్ ఎం.ఎం.నాయక్ మీడియాతో మాట్లాడుతూ 3వేల ఎకరాల్లోనే భోగాపురం ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
దానికి భిన్నంగా గత నెల 22వ తేదీన 5040ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మిస్తున్నట్టు మంత్రి మృణాళిని ప్రకటించారు. ఇప్పుడా ప్లాన్‌ను కూడా కాదని 5551ఎకరాల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి ప్రకటించారు. అసలు ఎయిర్‌పోర్టుకు ఎంత భూమి కేటాయిస్తారో ఇప్పటికే స్పష్టం చేయడం లేదు. ఒకవేళ తాజాగా ప్రకటించిన 5551ఎకరాల్ని ఎయిర్‌పోర్టుకు పూర్తిగా కేటాయిస్తే అక్కడి నిర్వాసిత, బాధిత రైతులకు ప్రత్యామ్నాయ భూములు కేటాయింపుతో పాటు పునరావాసం కల్పించేందుకు మరో 3,500ఎకరాల వరకు వేరే చోట సేకరించాల్సి ఉంటుంది. అంటే ఈ భూమి కోసం మరో ప్రాంత రైతుల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది.ఆ ప్రాంతాలు ఏవని ముందే చెబితే అక్కడి నుంచి వ్యతిరేకత వస్తుందని గుట్టుగా ఉంచుతున్నారు.
ఎయిర్‌పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చెందిన ప్రత్యామ్నాయ భూములిస్తామని మంత్రులు ప్రకటిస్తున్నా ఆ తర్వాత ఏ మారుమూల ప్రాంతంలో ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి రైతులు అంగీకరిస్తే ఆ తర్వాత ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తోందని పేరు చెప్పని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా భూసమీకరణ సర్వే మొదలు పెట్టేముందు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ ప్రచురించకుండా, నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో సర్వే, రెవెన్యూ సిబ్బంది వెళ్తూ భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం భిన్నమైన ప్రకటనలు చేస్తూ రైతులతో మైండ్‌గేమ్ ఆడుతోంది. రైతులు ఒప్పుకుంటే పెద్ద ఎత్తున భూసమీకరణ చేసి, వ్యాపారం చేసుకుందామని భావిస్తోంది. కానీ, డామిట్ కథ అడ్డం తిరిగినట్టు బతుకుపై బెంగ.. భవిష్యత్తుపై భయంతో రైతులు సమష్టిగా వ్యతిరేకించడంతో సర్కార్ ప్లాన్ వర్క్ అవుట్ కావడం లేదు.