మండే ఎండలు.. అప్రమత్తత అవసరం
– అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి
అనంతపురం మెడికల్ : ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి పేర్కొన్నారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. తీవ్రమైన తలనొప్పి, నీరసంగా ఉండడం, చర్మం పొడిబారడం, సొమ్మసిల్లడం వంటివి వడదెబ్బ లక్షణాలన్నారు. నీరు తక్కువగా తీసుకోవడం, మత్తుపానీయాలు సేవించడం, ఎండలో తిరగడం, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పానీయాలు తాగరాదని, వదులుగా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలన్నారు. ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవాలన్నారు. శరీర ఉష్ణోగ్రత్త తగ్గించడానికి తడి వస్త్రంతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలన్నారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీహెచ్ఈఓ లక్ష్మన్న, ఐడీఎస్పీ ధరంసింగ్, ఎపిడమాలజిస్ట్ రామకృష్ణ, డిప్యూటీ హెచ్ఈఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.