ఇప్పుడు వీస్తున్న గాలి!
కొత్త కలాలు
కథా సాహిత్యం వందేళ్ళ మైలురాయిని దాటి జీవనదిలా ప్రవహిస్తూనే ఉంది. భండారు అచ్చమాంబతో మొదలైన మహిళా కథాసారస్వతం ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త రచయిత్రులతో కథాసాహిత్యం వర్తమాన వాస్తవికతని అందిపుచ్చుకుంటోంది. తద్వారా తెలుగు కథ సుసంపన్నం అవుతూనే ఉంది.
గత ఐదేళ్ళలో తెలుగు కథలు మొదలెట్టిన మహిళా కథకులని పరిశీలిస్తే కనీసం ఇరవై పైచిలుకు రచయిత్రులు తెలుగు కథా సాహిత్యంలోకి కొత్తగా అడుగుపెట్టారనిపిస్తుంది. వారిలో ఇంతవరకు మనం ఎరగని కొత్త స్వరాల్ని వినిపించినవాళ్ళు ఉన్నారు. ఇంతవరకు రాని కొత్త కథాంశాలని రాసినవాళ్లు ఉన్నారు. పాత కథలను కొత్తగా చెప్పేవాళ్ళు, తెలిసిన కథలలోనే కొత్తకోణాలని చూసినవాళ్ళు ఉన్నారు. స్థూలంగా చూస్తే ఈ కథకులందరిలో కనపడుతున్న సామ్యం వాళ్ళు ప్రతిబింబిస్తున్న వర్తమాన సామాజిక వాస్తవికత. ఈ వర్తమాన వాస్తవికతలోనే ఎంతో క్లిష్టత ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, వ్యవహారిక కారణాలు ప్రతి జీవితంలోకి అనివార్యంగా ప్రవేశిస్తున్నాయి. ఇవి మనుషుల మధ్య (ముఖ్యంగా స్త్రీ- పురుష) సంబంధాలలో ఎన్నో రకాల మార్పులకీ, కొండకచో స్పర్థలకీ కారణం అవుతున్నాయి. స్త్రీవాద దృక్కోణంలో నుంచి చూస్తే పితృస్వామ్య అవశేషాల తాకిడీ ఇంతకు ముందు ఎరుగని కొత్త రూపాలలో దాడి చేస్తున్నది. ఇలాంటి వ్యవస్థను ప్రతిబింబిస్తున్న కథలు ఈతరం రచయిత్రులు అందుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
పురుషాధిక్యాన్ని ఎదిరించి నిలిచిన భార్యని, తనపై టెక్నాలజీ సాయంతో నిఘా పెట్టిన సహచరుణ్ణి తిరస్కరించే అమ్మాయిని ఒకే కథలో ఇమిడ్చి ‘వైదేహీ మైథిలోయం’ రాశారు సాయిపద్మ. ఇల్లు అనే కలను నిజం చేసుకునేందుకు రెండు దేశాలలో విడివిడిగా ఉంటూ టెక్నాలజీ సాయంతో పలకరించుకునే జంట ‘దో దీవానే దో షహర్ మే’ను ఆసక్తిగా పరిచయం చేస్తారు పూర్ణిమ తమ్మిరెడ్డి. తెలిసీ తెలియని వయసులోని ప్రేమ- వైవాహిక జీవితంపైన చూపించే ప్రభావాన్ని కథగా మలిచారు రాధ మండువ ‘గౌతమి’ కథలో.
మనకు బాగా తెలిసిన కథల్లోనే మనకు తెలియని, అంత సులభంగా గ్రహింపుకి రాని సున్నితమైన కోణాన్ని పరిచయం చేసే రచనలు కొంతమంది రచయిత్రులు చేస్తున్నారు. ‘రంగ పిన్ని ఆకాశం’ కథలో సంసారంలో హింస కొత్త పరిష్కారాన్ని సూచిస్తూనే, సంసారంలో స్త్రీకి ఉండాల్సిన పర్సనల్ స్పేస్ గురించి ప్రస్తావించారు సాయిపద్మ. ఒక సాధారణమైన ప్రేమకథ ముగిసిపోయేటప్పుడు ఆ ముగింపు పలకడంలోనూ మగవాడు ఆధిక్యతని ప్రదర్శిస్తున్నాడా అంటూ కొత్త కోణాన్ని పరిచయం చేసే అపర్ణ తోట కథ ‘ప్రేమకథ రిఫైన్డ్’ కూడా అలాంటిదే.
నవతరం రచయిత్రులలో కనపడుతున్న మరో విశేషం శైలీశిల్పాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ. పూర్ణిమ తమ్మిరెడ్డి కథలలో ‘ైమై లవ్ లైఫ్.లై’ కథ పేరుకు తగ్గట్టే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కథ. కథలో సన్నివేశాలలో కొన్నింటిని ప్రోగ్రామింగ్ కోడ్ రాసినట్లు రాయడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ‘విచ్ ఆర్ బిచ్‘ అనే పేరుతో ఇదే రచయిత్రి రాసిన మరో కథ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. స్వాతికుమారి బండ్లమూడి ‘ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్ మీద’ కథ మార్మికంగా సాగే మ్యూజింగ్స్లా ఉంటుంది. ఇదే రచయిత్రి రాసిన ‘వాంగ్మూలం’లో గాఢమైన కవితాత్మక వాక్యాలు అలరిస్తాయి. అయితే రచయిత్రులు కేవలం స్త్రీ సమస్యలకే పరిమితం కావడం లేదు. సామాజిక సమస్యలను, సంబంధాలను కూడా తమదైన కోణంలో వ్యాఖ్యానిస్తున్నారు. రాధిక పేరుతో కథలు రాస్తున్న హరితాదేవి మతతత్వ శక్తులను నిరసిస్తూ ‘ఆయుధం’ వంటి కథ రాశారు. పురాణపాత్ర అయిన శిఖండిని తీసుకుని ‘భీష్మ... నాతో పోరాడు’ అనే కథ ఆసక్తి కలిగిస్తుంది. ఇది థర్డ్ జెండర్ మీద చర్చ పెట్టిన కథ. విజయ కర్రా రాసిన ‘అమ్మ కడుపు చల్లగా’ కథ దాతృత్వానికి వెనకాడడం అనే చిన్న అంశం చుట్టూ అల్లిన మంచి కథ. బత్తుల రమాసుందరి ‘నమూనా బొమ్మ’లో ఎదుటివారిపై చూపించే జాలి కూడా మన అహాన్ని తృప్తి పరచడానికే అంటూ కొత్తకోణాన్ని చూపిస్తారు. ఒక తాగుబోతు దృష్టికోణం నుంచి జీవిత కథ చెప్పడానికి ప్రయత్నించారు రాధ మండువ ‘తాగుబోతు’ కథలో. ఇంకా కవిత.కె, రమా సరస్వతి వంటి కొత్తగళాలు ఎన్నో.
మొత్తంగా చూస్తే కొత్తతరం రచయిత్రులు తమ రాకడతో భవిష్యత్ కథలపైన కోటి ఆశలను కలిగిస్తూ ఉన్నారు. అధ్యయనం, సాధన, స్వీయ అంచనా వీరిని కథాసాహిత్యంలో కొనసాగేలా చేస్తాయని ఆశిద్దాం.
- అరిపిరాల సత్యప్రసాద్ 9966907771