అధికార పార్టీ గూండాగిరి
♦ ఉచితంగా ఇసుక తోలలేదని కుటుంబంపై దాడి
♦ మహిళ మెడలో బంగారు ఆభరణాల దోపిడీ
నరసరావుపేట టౌన్ : అధికార పార్టీ నాయకులు బుధవారం అర్థరాత్రి ఓ ఇంటిపై దాడికి పాల్పడి యువకుడ్ని తీవ్రంగా గాయపరచడంతో పాటు అడ్డొచ్చిన అతని తల్లి మెడలో బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. ఈ సంఘటనపై బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బరంపేటకు చెందిన జమ్ముల నాగార్జున ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. ఇరవై రోజుల కిందట అధికార పార్టీకి చెందిన నాయకుడు కుంపటి రవి అతని వద్దకు వచ్చాడు. ఉచితంగా ఇసుక తోలాలని, లేకపోతే వ్యాపారం చేయకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
అతని మాటల్ని నాగార్జున బేఖాతరు చేయడంతో కక్ష పెంచుకున్న రవి బుధవారం అర్ధరాత్రి అతని అనుచరులతో నాగార్జున ఇంటి పైకి రాడ్లుతో వచ్చి దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని సామాన్లు ధ్వంసం చేస్తుండగా అడ్డొచ్చిన నాగార్జున తల్లి అచ్చమ్మ మెడలో బంగారు నల్లపూసల గొలుసును లాక్కొని ఆమెను కిందకి నెట్టి వేశారు. సంఘటనలో గాయపడ్డ నాగార్జునను బంధువులు ఏరియా వైద్యశాలకు తరలించారు.
దాడిని ఖండించిన ఎమ్మెల్యే
నాగార్జునపై దాడిని తెలుసుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడ్ని గురువారం పరామర్శించి విషయం తెలుసుకున్నారు. అధికార పార్టీ ముఠా ఈ చర్యకు ఒడిగట్టిందని, పోలీసులు ప్రత్యేక దృష్టిసారించి వారి ఆగడాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మారణాయుధాలతో దాడిచేసి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. దాడికి పాల్పడ్డ నిందితులంతా యథేచ్ఛగా తిరుగుతున్నారని వారిపై తక్షణమే చర్యలు తీసుకొని, బాధితులకు రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.