బీబీసీ న్యూస్‌కు ప్రధాని బెదిరింపులు
లండన్: 'నా మీదా, మా పార్టీ విధానాల మీదా వ్యతిరేక వార్తలు ప్రసారం చేయడానికి ఎంత ధైర్యం మీకు? చూస్తా.. అధికారదండం నా చేతికొచ్చిన తర్వాత మీ అంతు చూస్తా..' ఇవీ బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ బీబీసీ న్యూస్ ప్రతినిధితో అన్న మాటలు.
గడిచిన మేలో బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించడం, ఆ పార్టీకి నేతృత్వం వహిస్తున్న కామెరూన్ రెండో సారి ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో ఓ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కామెరూన్ ఇలా బెదిరింపులకు దిగాడని బీబీసీ న్యూస్ పొలిటికల్ ఎడిటర్ నిక్ రాబిన్సన్ ఇటీవలే వెల్లడించారు. దీనిపై ది టెలిగ్రాఫ్ పత్రికలో సోమవారం ఒక కథనం ప్రచురితమైంది.
'బీబీసీ సంస్థను మూసేస్తానని కామెరూన్ అన్నప్పుడు మొదట జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ ఆయన ప్రతి మాట వెనుక మాపై దాగున్న అక్కసు కొద్దిసేపటి తర్వాతగానీ అర్థంకాలేదు. ఆ ఇంటర్వ్యూ తీసుకున్నది ఓ బస్సులో. అందులో కామెరూన్, నాతో సహా ఇంకొద్దిమంది కూడా ఉన్నారు' అని రాబిన్సన్ తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీ ఆర్థిక విధానాలు ఆచరణ సాధ్యమైనవికావని, ఆ పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని గత ఎన్నికల సందర్భంలో బీబీసీ పలు కథనాలను ప్రసారం చేసింది.