పార్లమెంటులో 'పోకేమాన్ గో' ఆడిన ప్రధాని!
ఓస్లో: 'పోకేమాన్ గో' ప్రపంచాన్ని ఉర్రుతలూగించిన ఆండ్రాయిడ్ గేమ్. ఈ మధ్యకాలంలో గేమ్ కు కొంచెం క్రేజ్ తగ్గినట్లు కనిపించినా.. అది నిజం కాదని తాజా ఘటన చెబుతోంది. సాక్ష్యత్తూ ఒక దేశ ప్రధానమంత్రి పార్లమెంట్ లో పోకేమాన్ గో ఆడుతూ దొరికిపోయారు. సభలో రసవత్తరమైన డిబేట్ జరుగుతున్నా ఏమీ పట్టనట్లుగా పోకేమాన్ గోలో మునిగిపోయారు నార్వే ప్రధానమంత్రి ఎర్నా సోల్ బర్గ్.
గతంలో అధికారిక పర్యటన మీద సోల్వాకియా దేశానికి వెళ్తున్న సమయంలో పోకేమాన్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. పర్యటన సమయంలో సోల్ బర్గ్ పోకేమాన్ ఆడుతున్న ఫోటోలు ఓ నార్వేయన్ పత్రికలో కూడా ప్రచురితమయ్యాయి. కాగా, పోకేమాన్ గో ఆడుతూ దొరికిపోవడంపై మాట్లాడిన ఆమె మహిళలు ఒకే సమయంలో రెండు పనులను చక్కబెట్టగలరని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.
నార్వేకు చెందిన మరో రాజకీయ నేత కూడా విదేశాంగ, రక్షణ శాఖల సమావేశంలో పోకేమాన్ గో ఆడుతూ కనిపించారు. దీంతో సదరు నేతపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలపై స్పందించిన నేత తాను గేమ్ ఆడుతున్నప్పుడు మరింత శ్రద్ధగా వినగలుగుతానని చెప్పారు.