ఉద్వాసన పలకాల్సిందే
సాక్షి, చెన్నై :అధికార పక్షానికి తొత్తుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి సందీప్ సక్సేనాను ఆ పదవి నుంచి తొలగించాల్సిందేనని పీఎంకే కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈసీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టేందుకు సిద్ధమైంది. అలాగే, అన్నదాతల ఆత్మహత్యల నివారణ లక్ష్యంగా రుణాల రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడికి నిర్ణయించింది. దిండి వనంలోని తైలాపురం తోట్టంలో పీఎంకే రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు అధ్యక్షతన ఆ పార్టీ కూటమి సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసు, పార్టీ అధ్యక్షుడు జీకే మణి, కేంద్ర మాజీ మంత్రులు ఏవీ వేలు, ఏకే మూర్తిల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం, పార్టీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతూ, ప్రజల్లోకిచొచ్చుకు వెళ్లడం లక్ష్యంగా కార్యక్రమాల విస్తృతానికి ఈ సమావేశంలో కార్యచరణను సిద్ధం చేశారు. అలాగే, త్వరలో జరగనున్న పార్టీ మహానాడు విజయవంతం లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు.
ఈసీపై ధ్వజం:
ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సందీప్ సక్సేనా తీరుపై ఈ సమావేశంలో ధ్వజమెత్తారు. అధికార పక్షానికి తొత్తుగా ఆయన వ్యవహరిస్తున్నారని, ఆయన నేతృత్వంలో 2016 ఎన్నికలు జరిగేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. ఆయనకు ఉద్వాసన పలికి, నీతి నిజాయితీకి కట్టుబడి పనిచేసే అధికారిని ఎన్నికల ప్రధాన అధికారిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఆయన్ను తొలగించాలని పట్టుబడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చే విధంగా పోరు బాటకు సిద్ధం కానున్నారు. కులాల వారిగా జనగణనను వివరాలను త్వరితగతిన వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సొంత స్థలం కూడా లేని కుటుంబాలు కోట్లల్లో ఉన్నాయని, కూలి కార్మికులుగా బతుకు జీవనం సాగిస్తున్న వాళ్లను బలోపేతం చేయడానికి సరికొత్త ఉపాది కార్యక్రమాలను విస్తృత పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే, భూ సేకరణ చట్టం అమలు ప్రయత్నాన్ని వీడాలని, అన్నదాతల ఆత్మహత్యల నివారణ లక్ష్యంగా వారు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే సమావేశంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడం లక్ష్యంగా ప్రజల్లో చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలకు కార్యచరణ సిద్ధం చేస్తూ తీర్మానాలు ప్రవేశ పెట్టారు.