PMKVY
-
60 వేల మందికి నైపుణ్య శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) పథకాన్ని కేంద్రప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు అంశాలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నిపుణులను తయారు చేస్తుండగా తాజాగా ఆసక్తితో కూడిన వృత్తి నైపుణ్యం దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అధికసంఖ్యలో యువతకు నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు రాష్ట్రాలవారీగా లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి 60 వేలమంది యువతకు ప్రాధాన్యత, ఆవశ్యకత ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని సూచించింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ చర్యలు మొదలుపెట్టింది. 2020 నాటికి రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. జిల్లాలకు లక్ష్య నిర్దేశాలు కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్దేశించగా వాటి సాధనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీ లక్ష్యాలను నిర్దేశించింది. ఈ క్రమంలో యువత, అక్షరాస్యత, నిరుద్యోగం తదితర అంశాలను పరిగణిస్తూ ఉపాధి కల్పన శాఖ 33 జిల్లాలకు లక్ష్యాలను ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులకు సమాచారం అందించింది. జిల్లా స్థాయిలో పీఎంకేవీవై అమలు కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, నోడల్ అధికారిగా జిల్లా ఉపాధి కల్పన అధికారి వ్యవహరిస్తారు. పీఎంకేవీవై కింద దాదాపు 275 రకాల వృత్తులకు సంబంధించి శిక్షణలు ఇస్తున్నారు. ఇందులో 200 గంటల నుంచి 1,200 గంటల వరకు కార్మిక నిబంధనల మేరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. నైపుణ్యాభివృద్ధిశిక్షణ కార్యాక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 127 ట్రైనింగ్ పార్ట్నర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి శిక్షణ, తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిబంధనల మేరకు నిధులు విడుదల చేస్తుంది. ఈ ట్రైనింగ్ పార్ట్నర్లు నిరుద్యోగులను ఎంపిక చేసేందుకు జిల్లాలు, డివిజన్ స్థాయిలో కౌశల్ మేళాలు ఏర్పాటు చేస్తారు. అదేతరహాలో రోజ్‌గార్ మేళాలు నిర్వహించి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం, నైపుణ్యాన్ని మెరుగుపర్చడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. అనంతరం శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందిస్తారు. ప్రాధాన్యత రంగాలు, ఉపాధి మెరుగ్గా ఉండే కంపెనీల్లో ఈ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉపాధి కల్పన శాఖ చర్యలు తీసుకుంటుంది. -
నిపుణుల రాజధానిగా భారత్
పేదల నుంచి నిపుణుల సైన్యాన్ని తయారు చేస్తాం * ప్రతి పేదవాడూ నా సైనికుడు * పేదరికంపై పోరాటంలో విజయం సాధించాలి * 2022 నాటికి 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ * ప్రధాన్‌మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని ప్రారంభించిన మోదీ న్యూఢిల్లీ: భారతదేశం ప్రపంచ మానవ వనరుల రాజధానిగా ఎదగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. విశ్వ ఉత్పత్తి కర్మాగారంగా చైనా అవతరించినట్లే నైపుణ్య భారత్‌గా మన దేశం ఆవిర్భవించాలని ఆయన అన్నారు. ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతిష్టా త్మకమైన ‘‘ప్రధాన్‌మంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై)’’ కార్యక్రమాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం మోదీ ప్రారంభించారు. దీంతో పాటు నైపుణ్యాభివృద్ధి-పారిశ్రామిక జాతీయ విధానం-2015, నైపుణ్య రుణాల పథకాలను ప్రారంభించారు. కొంతమంది ఎంపిక చేసిన ట్రైనీలకు ఆయన చేతుల మీదుగా రుణాలు అందించారు. ‘‘స్కిల్ ఇండియా’’ లోగోను కూడా ప్రధాని ఆవిష్కరించారు. యువతలో ఆత్మాభిమానాన్ని పెంపొందించి.. వారి కాళ్లపై వారు నిలబడేలా చేసేందుకు ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకురావలసిన అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం నైపుణ్య భారత్ మిషన్‌ను ప్రారంభించిందని మోదీ అన్నారు. ‘‘మనం చేస్తున్నది పేదరికంపై పోరాటం.. పేదల నుంచి మనం పటిష్టమైన సైన్యాన్ని తయారు చేయాలి. ప్రతి పేదవాడు నా సైనికుడే.. వారి లోపల దాగున్న ప్రతిభను వెలికి తీయడం ద్వారా పేదరికంపై యుద్ధంలో విజయం సాధిస్తాం’’ అని మోదీ అన్నారు. పోటీలో వెనుకబడిన పేదలను ముందుకు తీసుకురావాలనే ఈ పథకాన్ని ప్రారంభించామని. రాష్ర్ట ప్రభుత్వాల సమన్వయంతో కేంద్రం కలసి పనిచేస్తామని మోదీ అన్నారు. దేశంలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వయసున్న వారే ఉన్నారని వాళ్లు ఏదో ఒక రంగంలో నైపుణ్యం సాధించకపోతే దేశానికి వారే పెద్ద సవాలుగా మారతారని మోదీ అన్నారు. ‘‘ప్రపంచం... పరిజ్ఞానం చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సి ఉంది. రానున్న పదేళ్లలో పారిశ్రామిక వేత్తలు.. టెక్నాలజీ నిపుణుల పరస్పర సమన్వయంతో యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచాల్సి ఉంది.’’ అని ఆయన అన్నారు. చైనా ప్రపంచ ఉత్పాదక కర్మాగారంగా అగ్రస్థానంలో ఉన్నట్లే మన దేశం కూడా మానవ వనరుల రాజధానిని చేయటం కోసం అంతా దృఢచిత్తంతో పని చేయాలని మోదీ తెలిపారు. పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లో సంపద పోగై ఉన్నప్పటికీ.. వాటి దగ్గర మానవ వనరుల కొరత విపరీతంగా ఉందని మోదీ అన్నారు. మన దగ్గర సరైన నిపుణులను తయారు చేసుకోగలిగితే.. ప్రపంచానికి మన అవసరం తప్పనిసరిగా ఏర్పడుతుందన్నారు. దేశ వ్యాప్తంగా శిక్షణ సంస్థలు క్రియాశీలకంగా వ్యవహరించాలని.. ఐఐటీ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఎలాగైతే పేరు తెచ్చుకున్నాయో.. ఐటీఐలు కూడా ప్రపంచదేశాల్లో తమదైన ముద్ర కనిపించేలా తయారు కావాలని మోదీ అన్నారు. తమ ప్రభుత్వ అతి ముఖ్యమైన ప్రాధాన్య అంశం యువతకు ఉపాధి కల్పించడమేనన్నారు. 2022 నాటికి 40.02 కోట్ల మందికి శిక్షణ ఇస్తామని ప్రధాని వివరించారు. మోదీ ప్రసంగంలోని మరి కొన్ని అంశాలు.. * మన యువత ఎవరి దయాదాక్షిణ్యాలపైనో బతకాలనుకోవటం లేదు. వారి ప్రతిభతోనే తలెత్తుకుని బతకాలనుకుంటున్నారు. * ప్రభుత్వ ముఖ్యమైన ప్రాధాన్యాంశం విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించటం * యువత తమంతట తాము ఉపాధిని సాధించేందుకు అనువైన నిర్మాణాత్మకమైన వ్యవస్థలను మనం సృష్టించాలి. * ఈ పథకం మీ జేబులను నింపటం కోసమే కాదు.. మీలో ఆత్మస్థైర్యం నింపటం.. జీవితంలో నూతన శక్తిని కలిగిస్తాం * లక్షలాది యువత వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించాలి.. ఆధునిక భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి. * వచ్చే దశాబ్ద కాలంలో నాలుగు నుంచి 5 కోట్ల వరకు మానవ వనరుల మిగులు మన దేశంలో ఏర్పడుతుంది. ప్రపంచ సవాళ్లను దీటుగా ఎదుర్కొనే విధంగా ఈ మానవ వనరులను మనం తీర్చి దిద్దాలి. * దేశంలో మొదటి సారి యువకుల నైపుణ్యానికి ప్రభుత్వ ధృవీకరణ లభిస్తోంది. నైపుణ్యాభివృద్ధికి ప్రతి రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయం యువతలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి రాష్ట్రంలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్రూఢీ తెలిపారు.దేశంలో మిగులు మానవ వనరులను నైపుణ్య వనరుగా మారుస్తామని ఆర్థిక మంత్రి జైట్లీఅన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మంచి స్థానంలో నిలుస్తుందని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాన్‌మంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే.. దేశంలో 35 ఏళ్ల లోపు యువతను వివిధ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఇది. వచ్చే ఏడాది చివరికల్లా 24 లక్షల మందికి సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి విద్యల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2022 నాటికి 40 కోట్ల మందిని గుణాత్మక నిపుణులుగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. స్కిల్ లోన్స్: నైపుణ్య శిక్షణ పొందిన యువతకు స్కిల్ లోన్ పేరుతో రూ. 5 వేల నుంచి రూ. 1.5 లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. రానున్న అయిదేళ్లలో దేశ వ్యాప్తంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల్లో శిక్షణ పొందిన యువకుల్లో 34 లక్షల మందికి రుణ సదుపాయం కల్పించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. పరశురాంకు ప్రశంస నైపుణ్య భారత కార్యక్రమంలో తెలంగాణ యువకుడు పరశురాం నాయక్‌కు మోదీ ప్రశంసాపత్రాన్ని అందచేశారు. న్యూజిలాండ్‌లో ఏప్రిల్‌లో జరిగిన ప్రపంచ స్కిల్ ఒసెనియా-2015 పోటీ ల్లో ‘ఇటుకలు పేర్చడం’లో నైపుణ్యాన్ని ప్రదర్శించిన పరుశురాంకాంస్య పతకం సాధించడాన్ని మోదీ అభినందించారు.