
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) పథకాన్ని కేంద్రప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. ఇప్పటివరకు అంశాలవారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి నిపుణులను తయారు చేస్తుండగా తాజాగా ఆసక్తితో కూడిన వృత్తి నైపుణ్యం దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అధికసంఖ్యలో యువతకు నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు రాష్ట్రాలవారీగా లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి 60 వేలమంది యువతకు ప్రాధాన్యత, ఆవశ్యకత ఉన్న రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని సూచించింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ చర్యలు మొదలుపెట్టింది. 2020 నాటికి రాష్ట్రానికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది.
జిల్లాలకు లక్ష్య నిర్దేశాలు
కేంద్రం రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్దేశించగా వాటి సాధనకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీ లక్ష్యాలను నిర్దేశించింది. ఈ క్రమంలో యువత, అక్షరాస్యత, నిరుద్యోగం తదితర అంశాలను పరిగణిస్తూ ఉపాధి కల్పన శాఖ 33 జిల్లాలకు లక్ష్యాలను ఖరారు చేసింది. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారులకు సమాచారం అందించింది. జిల్లా స్థాయిలో పీఎంకేవీవై అమలు కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, నోడల్ అధికారిగా జిల్లా ఉపాధి కల్పన అధికారి వ్యవహరిస్తారు. పీఎంకేవీవై కింద దాదాపు 275 రకాల వృత్తులకు సంబంధించి శిక్షణలు ఇస్తున్నారు. ఇందులో 200 గంటల నుంచి 1,200 గంటల వరకు కార్మిక నిబంధనల మేరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
నైపుణ్యాభివృద్ధిశిక్షణ కార్యాక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 127 ట్రైనింగ్ పార్ట్‌నర్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి శిక్షణ, తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిబంధనల మేరకు నిధులు విడుదల చేస్తుంది. ఈ ట్రైనింగ్ పార్ట్‌నర్లు నిరుద్యోగులను ఎంపిక చేసేందుకు జిల్లాలు, డివిజన్ స్థాయిలో కౌశల్ మేళాలు ఏర్పాటు చేస్తారు. అదేతరహాలో రోజ్‌గార్ మేళాలు నిర్వహించి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం, నైపుణ్యాన్ని మెరుగుపర్చడం లాంటి కార్యక్రమాలు చేపడతారు. అనంతరం శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందిస్తారు. ప్రాధాన్యత రంగాలు, ఉపాధి మెరుగ్గా ఉండే కంపెనీల్లో ఈ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా ఉపాధి కల్పన శాఖ చర్యలు తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment