గుర్తుతెలియని మహిళ దారుణహత్య
పోచమ్మమైదాన్ (వరంగల్) : వరంగల్ నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గురువారం స్థానిక ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని కస్తూరిబా ఆశ్రమం వద్ద గుర్తు తెలియని మహిళ నిర్జీవంగా పడి ఉండగా స్థానికులు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. రాయితో తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయినట్లు భావిస్తున్నారు.
ముఖం చిధ్రం కావటంతో గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు నమూనాలను సేకరించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు.