చికిత్స పొందుతూ ‘సాక్షి’ విలేకరి కృష్ణ మృతి
హైదరాబాద్: నాలుగు రోజుల కింద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విలేకరి చేరాల కృష్ణ సోమవారం తుదిశ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన కృష్ణ (29) హయత్‌నగర్ మం డలం పెద్దఅంబర్‌పేట విలేకరిగా విధులు నిర్వహిస్తూ అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసముంటున్నారు. కృష్ణకు 2013లో ఎల్బీనగర్ చింతల్‌కుంటకు చెందిన గౌతమితో వివాహం జరిగిం ది. 10వ తేదీన రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వనస్థలిపురం ఆటోనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ తీవ్రంగా గాయపడ్డారు.
అప్పటి నుంచి ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం సాయంత్రం 4.30 సమ యంలో తుది శ్వాస విడిచారు. కృష్ణ మృతిపట్ల ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎడిటర్ మురళి సంతా పం ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్.దిలీప్‌రెడ్డి, సిటీబ్యూరో చీఫ్ ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డిలు కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. కృష్ణ కుటుంబ సభ్యులను ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శించారు. కృష్ణ స్వగ్రామం నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
ఫలించని సదుద్దేశం..: బ్రెయిన్ డెడ్ అయిన కృష్ణ అవయవాలను దానం చేయడానికి ఆయన కుటుంబీకులు సోమవారం ఉదయం జీవన్‌దాన్ సంస్థను సంప్రదించారు. వారు ఆసుపత్రికి వచ్చి పరీక్షలు జరిపి అవయవాల సేకరణకు సన్నద్ధమవుతున్న తరుణంలోనే కృష్ణ గుండె ఆగిపోయింది.