పండిట్, పీఈటీలకు పదోన్నతులు ఎప్పుడు?
– మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి
కడప ఎడ్యుకేషన్: పండిట్, పీఈటీ పదోన్నతుల కోసం ప్రభుత్వం జీవో ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పోచంరెడ్డి సుబ్బారెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కడప నగరంలోని శాంతినికేతన్ పాఠశాలలో ఆదివారం ఉపాధ్యాయుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సంబంధిత సమావేశానికి పీసీ రెడ్డెన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసి రెండు సంవత్సరాలు గడిచినా పదవ పీఆర్సీ ఆరియర్స్ ప్రకటించపోవడం దారుణమన్నారు. దీంతోపాటు పండిట్, పీఈటీ ప్రమోషన్ల జీవో ఇచ్చినా ఇంతవరకూ అమలు చేయలేదన్నారు. రెడ్డెన్న మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా ఏకీకృత సర్వీస్ రూల్స్ లేక 556 మంది ఎంఈఓలు, 48 డిప్యూటీ ఈఓలు, 292 మంది డైట్ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మాజీ ఎంఈఓ రమణారెడ్డి మాట్లాడుతూ గురుకుల, మోడల్ ఉపాధ్యాయులకు పదవ పీఆర్సీని ప్రకటించాలన్నారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ స్పెషల్ టీచర్స్‌కు నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రకటించాలన్నారు. సమావేశంలో లెక్కలజమాల్రెడ్డి, ఆప్టా జిల్లా అధ్యక్షులు చల్లా ప్రసాద్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, ప్రభాకర్‌రాజు, పురుషోత్తమరెడ్డి, రామచంద్రయ్య, విజయ్బాష్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.