ఒక అరవై!
నేడు ఆవిష్కరణ
2015వ సంవత్సరంలో అచ్చయిన కవితల్లోంచి నాకు విశిష్టంగా కనబడిన అరవై కవితల్ని ఎంచుకుని ఈ ‘‘కవిత్వం 2015’’ సంకలనాన్ని తీసుకొస్తున్నాను, ఇష్టంగా, ఒక అవసరంగా, ఒకింత సాంస్కృతిక కర్తవ్యంగా. అరవై అనే లెక్క ఎందుకంటే - సంకలనం బిగువుగా వుండాలని. తెలుగు సంస్కృతికీ అరవైకీ వున్న అనుబంధం కూడా దీనికి ఓ అనుబంధ కారణం.
ఒక సంవత్సరంలో వివిధ పత్రికల్లో (వెబ్ సంచికల్తో సహా) అచ్చయే తెలుగు కవితలు కొన్ని వేలల్లో వుంటాయి.
వాటిలోంచి ఓ అరవై కవితల్ని ఎంచుకోవడం కష్టతరమైన పనే అని నా అనుభవం చెబుతున్నది. ఐతే దేశంలోనూ, బయటా వున్న అన్ని ప్రాంతాల్లోని తెలుగుకవుల కవిత్వానికి స్థూలంగా ఈ సంకలనంలో ప్రాతినిధ్యం వుండాలని భావించాను. 2015వ సంవత్సర కాలంలో మానవ జీవన ప్రస్థానంలోని ప్రధాన ఘటనలకు కవుల ప్రతిస్పందనను రికార్డు చేయడం ద్వారా కాలఛాయను సంకలనంలో చూపించాలని ప్రయత్నించాను. ఘటనలకే పరిమితం కాకుండా, మానవానుభవానికున్న అనేక పార్శ్వాల్నీ, చింతనల్నీ ఒక చోటికి చేర్చడం కూడా అత్యావశ్యకమని భావించాను.
సామాజిక దృక్కోణం నుంచి వచ్చినవి కొన్నీ, ఆత్మగత అనుభవాల్నీ, అనుభూతుల్నీ ఆవిష్కరించినవి కొన్నీ, మానవ సంబంధాల్ని వ్యాఖ్యానించినవి కొన్నీ, జీవన తాత్విక సారాంశాన్ని వడగట్టినవి కొన్నీ, స్థానికతను నిర్దిష్టంగా వెల్తురులోకి తెచ్చినవి కొన్నీ, సౌందర్య చింతనలోంచి రూపుదిద్దుకున్నవి కొన్నీ, ఉద్యమాల నేపథ్యం నుంచి గొంతెత్తినవి కొన్నీ, ప్రకృతిని కవితా ప్రాంగణంలోకి ఆహ్వానించినవి కొన్నీ- వెరసి ఈ సంకలనం.
2015లో కవయిత్రి శివలెంక రాజేశ్వరీదేవి, 2016లో ప్రముఖ కవి, విమర్శకులు అద్దేపల్లి రామమోహనరావు మరియు అరుణ్ సాగర్ ఈ లోకం నుంచి నిష్ర్కమించారు. 2015లో అచ్చయిన వారి కవితల్ని ఈ సంకలనంలో చేర్చాను, వారికి నివాళిగా.