తిరుమల తరహాలో ఆర్జిత సేవా టికెట్లు
– అధికారులతో తిరుపతి జేఈవో
తిరుపతి అర్బన్ : టీటీడీ పరిధిలోని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా తిరుమల తరహాలో ఆర్జిత సేవా టికెట్లను జారీ చేయనున్నట్టు తిరుపతి జేఈవో పోలా భాస్కర్ వెల్లడించారు. తిరుపతిలోని ఏడీ బిల్డింగ్లో గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జిత సేవల టికెట్లతో పాటు తిరుచానూరులో నిర్వహిస్తున్న నిత్యపూజలు, వారపు సేవలు, వార్షిక సేవలు భక్తులకు అందుబాటులో ఉండేలా ఈ–దర్శన్ కౌంటర్లలో టికెట్లను విక్రయించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం అధికారులు ఐటీ అప్లికేషన్ను రూపొందించుకోవాలని సూచించారు. అమ్మవారి సేవల సమగ్ర సమాచారాన్ని టీటీడీ వెబ్సైట్లో ఉంచాలన్నారు. ఆమేరకు ఆలయం ముందు ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వచ్చే గురువారం నుంచి అమ్మవారి ఆలయంలో నిర్వహించే తిరుప్పావడ సేవకు సంబంధించిన టికెట్లను బుధవారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేణుగోపాల్, డిప్యూటీ ఈఈ ఉమాశంకర్, సీఏవో రవిప్రసాద్, ఏవీఎస్వో రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.